Site icon HashtagU Telugu

BJP Mission ‘South India’: బీజేపీ ‘మిషన్ సౌత్ ఇండియా’: టార్గెట్‌ 130 సీట్లు

Bjp's 'mission South India'..! Target 130 seats

Bjp's 'mission South India'..! Target 130 seats

By: దినేష్ ఆకుల

BJP Mission ‘South India’ : ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ గత 9 ఏళ్లలో దేశంలో అతివేగంగా విస్తరించింది. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా 10 లక్షల 72 వేలకు పైగా చోట్ల బీజేపీ కార్యకర్తలు , నాయకులు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా 978 జిల్లాలు, 15 వేల 923 మండలాలు, 10 లక్షల 56 వేల 2 బూత్‌లలో సంస్థాగతంగా BJP చాలా పఠిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ హోదాకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల బిజెపికి తిరుగులేని కోటగా మారాయి.

కర్ణాటకలో బిజెపి బలంగా ఉండటమే కాకుండా అక్కడ అనేక సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో పుంజుకుంటున్నా.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలోనే పార్టీ పనితీరుపై అనుమానాలున్నాయి. కానీ దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రాలే కీలకం కాబోతున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి కలిపి 130 మంది ఎంపీలను లోక్‌సభకు పంపగా, అందులో 29 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఇందులో ఒక్క కర్ణాటక నుంచి 25 సీట్లు, తెలంగాణ నుంచి 4 సీట్లు వచ్చాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు.

దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, దక్షిణ భారతదేశంలో బీజేపీ మరోసారి తన పూర్తి సత్తాను చాటుతున్నట్లు కనిపిస్తోంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఈసారి సొంతంగా పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. కర్నాటకలో 150 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే తెలంగాణ ఈ ఏడాది చివర్లో శాసనసభకు వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటాలను ఉధృతం చేసింది. అదే సమయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం పూర్తిగా మోదీ కరిష్మాపైనే ఆధారపడటంతో పాటు మిషన్ సౌత్ ఇండియా కింద, పార్టీ ఇతర పార్టీల ముఖ్యమైన నాయకులను కూడా తమతో కలుపుకునేందుకు ట్రైచేస్తోంది.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, కేంద్రమంత్రులందరూ దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ శనివారం కూడా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర ప్రజలకు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. మూడు రోజులుగా, ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ఢిల్లీలో పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమైన క్రమంగా పట్టు సాధించాలని ప్లాన్‌ చేస్తోంది. అనిల్ ఆంటోనీ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, , స్వాతంత్ర్య సమరయోధుడు సి.రాజగోపాలాచారి మునిమనవడు సి.ఆర్.కేశవన్‌ వంటి వారినిచేర్చుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపతానికి కృషి చేస్తోంది.

Also Read:  Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…