Site icon HashtagU Telugu

Police In Lockup: లాకప్ లో పోలీసులు.. బీహార్ లో కలకలం..ఎస్పీ నిర్వాకం వీడియో వైరల్!!

Lockup Imresizer

Lockup Imresizer

ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు లాకప్‌లో ఉంటారు..

అలాంటిది బీహార్‌లోని నవడా పట్టణంలో ఐదుగురు పోలీసులను లాకప్‌లో ఉంచారు..

ఇంతకీ ఎందుకు అలా చేశారు? ఎవరు అలా చేశారు? అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నవాదా ఎస్పీ గౌరవ్‌ మంగ్లా సెప్టెంబర్ 8న రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి అధికారుల పనితీరుపై సమీక్షించారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శత్రుఘ్న పాశ్వాన్‌, రాంరేఖా సింగ్‌, ఏఎస్సైలు సంతోష్‌ పాశ్వాన్‌, సంజయ్‌ సింగ్‌, రామేశ్వర్‌ ఉరాన్‌ను లాకప్‌లో ఉంచి తాళం వేశారు. రెండు గంటల తర్వాత వారిని విడిచిపెట్టారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ దృశ్యాలు బయటికి రావడంతో.. జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. లాకప్‌లో ఐదుగురు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎస్పీపై చర్యలు తీసుకోవాలని బీహార్‌ పోలీస్‌ అసోసియేషన్‌ కూడా డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారం బిహార్ చీఫ్ సెక్రటరీ అమిత్ సుభానీ వరకు వెళ్లడంతో సీరియస్‌ అయ్యారు. కింది స్థాయి ఉద్యోగులతో మంచిగా మసులుకోవాలని ఆదేశిస్తూ.. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఏ కారణం లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడొద్దని.. ఉద్యోగులను హింసిస్తే సహించబోమని చీఫ్ సెక్రటరీ హెచ్చరించారు.క్రమశిక్షణ పేరిట ఇష్టారీతిన వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఎస్పీ ఏమన్నాడు?

ఈ విషయమై ఎస్పీని మీడియా ప్రశ్నించగా.. అది తప్పుడు వార్త అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఈ విషయంలో నోరు మెదపొద్దని లాకప్‌లో ఉన్న పోలీసు అధికారులపై ఎస్పీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని చెరిపేసే ప్రయత్నాలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది.
దీన్ని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ వివాదంపై వారు స్పందించలేదు.

ఎస్పీ అందుబాటులో లేరని..

పోలీసులను లాకప్‌లో వేసిన ఘటన గురించి ఆరా తీయడానికి ప్రయత్నించగా.. ఎస్పీ అందుబాటులో లేరని బిహార్ పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ మృత్యుంజయ కుమార్ సింగ్ తెలిపారు.ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘అధికారులను ఎస్పీ లాకప్‌లో వేసిన విషయమై బిహార్ పోలీసుల్లో తీవ్రంగా చర్చ నడిచింది. ఇలాంటి ఘటనలను ఇంతకు ముందెప్పుడూ తాము చూడలేదు.. ఇలాంటి ఘటనలు బిహార్ పోలీసు విభాగం ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ఘటనపై న్యాయ విచారణ డిమాండ్ చేస్తున్నాం. అసలేం జరిగిందో సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరపాలి’ అని మృత్యుంజయ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు.

Exit mobile version