Bhu Bharati Bill : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని అన్నారు. భూములు ఉన్న ప్రతీ ఒక్కరికీ పూర్తిగా భద్రత కల్పించే విధంగా ఈ చట్టం తయారు చేశామని తెలిపారు. ధరణీలో పార్ట్ బీకి సంబంధించి 18లక్షల 26వేల ఎకరాలను ఈ చట్టం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ భూమి అయితే ఏ కారణం చేత పార్ట్ బీలో పెట్టారన సమస్యను పరిష్కరించేవిధంగా చట్టం తీసుకొచ్చామని తెలిపారు.
ప్రజలకు సంబంధించిన ఆస్తులకు పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇండ్లు ఉన్న స్థలాలకు ఏ రకమైన టైటిల్ ఉండదు. గ్రామకంఠాలకు పరిష్కారమార్గం కనుక్కొనేది ఈ చట్టంలో పొందుపరిచాం. వారికి హక్కు ఉన్న కార్డును ఈ చట్టంలో పేర్కొనబడిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం. భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మా ప్రభుత్వానిది అన్నారు.
పలు రాష్ట్రల్లో ఆర్వో ఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ధరణీని అర్థరాత్రి ప్రమోట్ చేశారని, నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన తెలిపారు. రెండు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లోపభూయిష్టమైన ఆర్వో ఆర్ చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం అని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!