Site icon HashtagU Telugu

Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న

Bharat Ratna

Bharat Ratna

Bharat Ratna : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్‌ (ఎక్స్) వేదికగా వరుస పోస్ట్‌లు చేశారు.

మన పీవీ గురించి ప్రధాని ఏమన్నారంటే.. 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించడంపై ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. దానిలో ఇలా రాసుకొచ్చారు. “మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారికి భారతరత్నతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఆయన విశిష్ట పండితుడు. రాజనీతిజ్ఞుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అనేక సంవత్సరాలు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషిని మరువలేం. పీవీ దూరదృష్టి గల నాయకత్వం భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించింది. దేశపు శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఒక బలమైన పునాదిని పీవీ వేశారు.  నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచేందుకు, ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నారు. భారతదేశ విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది.భారతదేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన గొప్ప నాయకుడిగా పీవీని మనం చూడొచ్చు’’ అని ప్రధాని మోడీ తెలిపారు.

చౌదరి చరణ్ సింగ్‌ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే.. 

మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోడీ ఇలా రాసుకొచ్చారు.. ‘‘చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న పురస్కారం అందించే అవకాశం  లభించడం మా ప్రభుత్వ అదృష్టం. ఈ గౌరవం ఆయన సాటిలేని కృషికి అంకితం చేయబడింది. చరణ్ సింగ్ జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసం అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినా.. దేశ హోం మంత్రిగా అయినా, ఎమ్మెల్యేగా అయినా దేశ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నాలు మరువలేనివి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చిరస్మరణీయమైంది. మన రైతు సోదర సోదరీమణులకు ఆయన అంకితభావం ఆదర్శప్రాయం. ఎమర్జెన్సీ సమయంలో  ఆయన చేసిన పోరాటం ప్రజాస్వామ్యం పట్ల చరణ్ సింగ్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం’’ అని ప్రధాని మోడీ వివరించారు.

ఎంఎస్ స్వామినాథన్‌ గురించి ప్రధాని మోడీ ఇలా అన్నారు..

డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన వేళ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. దానిలో ఇలా రాసుకొచ్చారు.. ‘‘వ్యవసాయ రంగం వికాసం కోసం, రైతుల సంక్షేమం కోసం  మన దేశానికి ఎనలేని సేవలు చేసిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. భారతదేశం హరిత విప్లవాన్ని సాధించడంలో స్వామినాథన్ పాత్రే కీలకం.  వ్యవసాయంలో భారతదేశ స్వావలంబనకు బీజాలు వేసిన మహనీయుడు స్వామినాథన్. విద్యార్థులకు, యువతకు  పరిశోధనలపై, వ్యవసాయంపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆయన చేసిన కృషిని దేశం మరువదు. దేశం యొక్క ఆహార భద్రత భావనకు స్వామినాథన్ విజన్ వల్లే బాటలు పడ్డాయి. ఆయన నాకు బాగా పరిచయం. జీవితంలో విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి స్వామినాథన్’’ అని ప్రధాని మోడీ కొనియాడారు.