CEO Killed Son : నాలుగేళ్ల కొడుకును చంపి.. బ్యాగులోకి కుక్కిన ఓ మహిళా సీఈవో

CEO Killed Son : ఓ మహిళ ఏకంగా తన నాలుగేళ్ల కొడుకును దారుణంగా హత్య చేసింది.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 12:31 PM IST

CEO Killed Son : ఓ మహిళ ఏకంగా తన నాలుగేళ్ల కొడుకును దారుణంగా హత్య చేసింది. అనంతరం కుమారుడి డెడ్ బాడీని ఒక బ్యాగులో తీసుకొని గోవా నుంచి బెంగళూరుకు ట్యాక్సీలో బయలుదేరింది. మార్గం మధ్యలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు సుచనా సేథ్‌. బెంగళూరులోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌’కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వీకెండ్ టూర్ కోసమని  శనివారం రోజు ఆమె గోవాకు వెళ్లారు. ఉత్తర గోవాలోని కాండోలిమ్‌ ప్రాంతంలో ఉన్న సోల్ బన్యన్ గ్రాండే హోటల్‌‌‌లోని ఒక రూమ్‌లో దిగారు. రెండు రోజుల తర్వాత(సోమవారం రోజు) సుచనా సేథ్‌ ఒంటరిగా గది నుంచి బయటకు వచ్చారు. గోవా నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ట్యాక్స్ బుక్ చేయమని హోటల్ సిబ్బందిని అడిగారు. గోవా నుంచి బెంగళూరుకు విమానమే బెస్ట్ అని హోటల్ నిర్వాహకులు చెప్పారు. అయినా సుచనా సేథ్ వినలేదు. తనకు ట్యాక్సీయే కావాలని తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక హోటల్ నిర్వాహకులు ట్యాక్సీని(CEO Killed Son) బుక్ చేశారు. అనంతరం ఒక బ్యాగు, లగేజీతో అక్కడి నుంచి సుచన కారులో బయలుదేరారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం అప్పటివరకు సుచనా సేథ్ ఉన్న రూంను క్లీన్ చేయడానికి వెళ్లిన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. బెడ్‌పై, ఫ్లోర్‌పై మొత్తం రక్తపు మరకలు కనిపించాయి. దీనిపై హోటల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వెంటనే గోవా పోలీసులకు సమాచారం అందించారు.  సుచనా సేథ్ ట్యాక్సీలో బెంగళూరుకు బయలుదేరిందని వివరించారు. హోటల్‌లోకి వచ్చేటప్పుడు సుచనతో కుమారుడు ఉన్నాడని.. వెళ్లేటప్పుడు లేడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అనంతరం గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ నంబరుకు కాల్ చేశారు. ఆ కారులోనే ఉన్న సుచనా సేథ్‌కు అనుమానం రాకుండా ట్యాక్సీ డ్రైవరుతో పోలీసులు కొంకణి భాషలో మాట్లాడారు. సుచనా సేథ్‌తో మాట్లాడి.. ఆమె కొడుకు గురించి అడగాలన్నారు.

Also Read: Gulmarg Vs El Nino : గుల్మార్గ్​‌లో మంచు మాయం.. ఏమైంది ?

అనంతరం సుచనతో మాట్లాడిన డ్రైవర్ .. మీ కొడుకు ఎక్కడ అని అడిగాడు. ఎవరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడని డ్రైవర్‌కు సుచనా సేథ్ చెప్పింది. ఈ సమాధానంతో నాలుగేళ్ల కుమారుడిని సుచనా సేథ్ ఏదైనా చేసి ఉండొచ్చని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం ట్యాక్సీ డ్రైవర్‌కు కాల్ చేసిన గోవా పోలీసులు.. క్యాబ్‌ను బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గ పట్టణం శివార్లలోని ఒక పోలీస్ స్టేషన్‌కు మళ్లించాలని ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ చెప్పినట్లుగానే చేశాడు.  ఆ వెంటనే చిత్రదుర్గ పోలీసులు సుచనా సేథ్‌ను అరెస్టు చేశారు. కారులోని బ్యాగ్‌లో ఆమె కుమారుడి మృతదేహం ఉన్నట్లు వెల్లడైంది. అనంతరం సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం తిరిగి గోవాకు తీసుకెళ్లారు.