Bengal govt invites protesting doctors: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వైద్య విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. చివరి ప్రయత్నంగా ఐదోసారి వైద్యులకు ఆహ్వానం పంపింది. కోల్‌కతా కాళీఘాట్‌లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది. ఈ మేరకు బెంగాల్ చీఫ్ సెక్రటరీ వైద్యులకు లేఖ రాశారు. ఇదే చివరి ఆహ్వానం అని.. ఓపెన్ మైండ్‌తో చర్చలు జరిపేందుకు కలవాలని లేఖలో కోరారు.
Read Also: CM Chandrababu : నేడు గుజరాత్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
కాగా, ఇప్పటికే నాలుగుసార్లు వైద్యులను దీదీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందుకు కొన్ని షరతులు కూడా పెట్టింది. 15 మంది వైద్యుల ప్రతినిధి బృందంతో చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే, ఆందోళన చేస్తున్న వైద్యులతో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో దీదీతో భేటీకి వైద్యులు అంగీకరించలేదు. వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించడంతో వైద్యులు చర్చా వేదికకు రావడానికి తిరస్కరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీఎం మమతా బెనర్జీ ప్రజల కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
కాగా, జూనియర్ వైద్యులు ప్రధానంగా ఐదు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపర్చాలని, ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.