Site icon HashtagU Telugu

ISKCON : చిన్మయ్‌ కృష్ణదాస్​కు బంగ్లాదేశ్‌ కోర్టులో నిరాశ

Bangladesh court denied bail to Chinmay Krishna Das

Bangladesh court denied bail to Chinmay Krishna Das

ISKCON : ఇస్కాన్‌ మాజీ సభ్యుడు చిన్మయ్‌ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్‌ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చిన్మయ్‌ కృష్ణదాస్‌ తరఫున సుప్రీంకోర్టుకు చెందిన 11మంది న్యాయవాదులు హాజరైనప్పటికీ, ఆయనకు బెయిల్‌ లభించలేదు. బంగ్లాదేశ్‌ జాతీయ పతకాన్ని అవమానించారనే ఆరోపణలపై గతేడాది నవంబర్‌ 25న చిన్మయ్‌ కృష్ణదాస్​ అరెస్టు అయిన విషయం తెలిసిందే.

ఇరు ప‌క్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువ‌రించారు. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు. కాగా, అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయ‌ర్లు.. ఇవాళ మెట్రోపాలిట‌న్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం త‌మ వాద‌న‌ల‌ను బ‌లంగానే వినిపించినా.. కోర్టు మాత్రం చిన్మ‌య్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను హ‌జ్ర‌త్ షాజ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

మరోవైపు కృష్ణదాస్‌ అరెస్ట్‌ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో భారత్‌ అప్రమత్తమైంది. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోరారు. హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక మతతత్వశక్తులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్‌ టార్గెట్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్‌పై ఇప్పటిదాకా ఎక్కడా ఏ వివాదాలూ లేవు. చివరికి భారత్‌పై విషంకక్కే పాకిస్తాన్‌లోనూ ఇస్కాన్‌ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఎక్కడా లేనివిధంగా బంగ్లాదేశ్‌లోనే వివాదం తలెత్తడం చూస్తుంటే.. ఇది కుట్రగానే కనిపిస్తోంది. జనవరి 2013 నుంచి సెప్టెంబరు 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై కనీసం 3వేలకు పైనే దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Read Also: YCP: కూట‌మిలో చిచ్చు పెడుతున్న వైసీపీ!