Surface-To-Air Missile: ఇండియా అమ్ముల పొదిలోకి అద్భుత అస్త్రం..QRSAM మిస్సైల్ పరీక్ష సక్సెస్!!

ఇండియా ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 06:15 AM IST

ఇండియా ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (QRSAM)ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్‌ 30 కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎగిరే లక్ష్యాలను ఛేదించగలదు.అంతేకాదు.. ఈ మిస్సైల్ కాల్పులు జరిపిన వెంటనే తన స్థలాన్ని సులభంగా మార్చేస్తుంది. ఫలితంగా శత్రు మిస్సైల్స్, రాడార్స్ దాన్ని సులభంగా పట్టుకోలేవు.

ప్రయోగం ఇలా..

డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ ను విజయవంతంగా పరీక్షించారు. ఏకంగా 6 ఫ్లైట్ టెస్టులు నిర్వహించారు. ఆరు హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలను టార్గెట్ చేసుకుని ఈ పరీక్షలు నిర్వహించారు. వివిధ పరిస్థితులలో ఆయుధ వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేశారు. దీన్ని త్వరలోనే భారత సైన్యంలోకి చేర్చనున్నారు.

రూ.476.43 కోట్ల వ్యయంతో..

డీఆర్‌డీఓ ద్వారా స్వదేశీ క్యూఆర్-శామ్  (QRSAM) క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టును 2014లో రూ.476.43 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఇది జూలై 2017 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే సాంకేతికత సవాళ్ల కారణంగా ఆ తేదీని పొడిగిస్తూ వచ్చారు.క్యూఆర్-శామ్ క్షిపణిలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సీకర్, మొబైల్ లాంచర్, పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్, నిఘా, బహుళ-ఫంక్షన్ రాడార్‌లతో కూడిన పరికరాలు ఉంటాయి. శత్రుదేశ యుద్ధవిమానాల రాడార్ల జామింగ్‌కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ కౌంటర్ చర్యలతో ఇది పోరాడుతుంది.