Site icon HashtagU Telugu

Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం

Minister Ponnam

Minister Ponnam

Minister Ponnam Prabhakar : తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర అన్ని శాఖల అధికారులతో ఫోన్ ద్వారా జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇండ్లలోనే క్షేమంగా ఉండాలని తెలిపారు. నిన్నటి నుండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు, కుంటలు తదితర అన్ని రకాలుగా నీటి వనరులు పూర్తిగా నిండి ఉన్నాయని చెప్పారు .ప్రజలు అవసరం అనుకుంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.ఈ రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జిల్లాలోని లో లెవెల్ వంతెనలు, కాజ్వేలను అధికారులు పరిశీలించి వాటి పైనుంచి నీరు ప్రవహించే వాటి వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులు ప్రయాణించకుండా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామాల రహదారులలో కూడా నిఘా ఉంచాలని అన్నారు. మత్స్యకారులు, యువకులు చేపలు పట్టడానికి చెరువులు వాగులు, వంకలు వద్దకు వెళ్ళరాదని, చిన్నారులు ఈత కొట్టడానికి నీటి వనరుల వద్దకు వెల్లరాదని సూచించారు. రైతులు ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటి పొలాల వైపు వెళ్ళరాదని, పశువుల కాపర్లు కూడా పశువులను తీసుకొని బయటకు వెళ్ళరాదు అని సూచించారు. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి పరిసరాల్లోకి వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే ప్రాంతాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని, ఏదైనా సమాచారం లేదా సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని 08457230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు సంప్రదించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: Telangana DPH Advisory: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో డెంగ్యూ కేసులు, ఒక్కరోజే 163