Antarctica goes dark: అంటార్కిటికా పై ఇక 4 నెలలు చీకటే.. తిమిరంలో సమరం చేస్తున్న శాస్త్రవేత్తలు!!

మీకు తెలుసా ? ఏడాదిలో 4 నెలలు చీకటి, 4 నెలలు వెలుతురు ఏకధాటిగా ఉండే ప్రాంతం ఒకటి భూమిపై ఉంది. అదే.. అంటార్కిటికా.

  • Written By:
  • Updated On - May 16, 2022 / 02:43 PM IST

మీకు తెలుసా ? ఏడాదిలో 4 నెలలు చీకటి, 4 నెలలు వెలుతురు ఏకధాటిగా ఉండే ప్రాంతం ఒకటి భూమిపై ఉంది. అదే.. అంటార్కిటికా. అక్కడ ఎండాకాలం మొత్తం (4 నెలలు) 24 గంటల పాటు ఎండలు కాస్తాయి. చలికాలంలో మొత్తం (4 నెలలు) 24 గంటల పాటు చీకటి కమ్మేస్తుంది. అంటార్కిటికాలోని కాంకార్డియా ప్రాంతంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు ఒక పరిశోధన కేంద్రం ఉంది. ఇప్పుడు అంటార్కిటికాలో చలికాలం ఉంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కాంకార్డియా పరిశోధన కేంద్రంలో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) పరిశోధకులు రీసెర్చ్ మొదలుపెట్టారు. చలికాలపు 4 నెలల చీకట్లలో విస్తృత పరిశోధనలు చేసేందుకు 12 మందితో కూడిన సైంటిస్టుల టీమ్ అక్కడికి వెళ్ళింది.

ఏయే పరిశోధనలు చేస్తారు ?

పూర్తిగా చీకట్లు 4 నెలల పాటు కమ్ముకొని ఉంటాయి. ఈక్రమంలో అంటార్కిటికాలో ఉండే పరిశోధకుల ఆరోగ్య స్థితిగతులు ఎలా మారుతాయి? జీవక్రియలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీర్ణక్రియలు ఎలా మారుతాయి? గుండె పనితీరులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? సముద్ర మట్టానికి 3233 మీటర్ల ఎత్తున ఉండే అంటార్కిటికాకు వెళితే క్రానిక్ హైపో బారిక్, హైపో క్సియా అనే స్థితి ఎదురవుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సీజన్ అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకీ వీటన్నింటి గురించి తెలుసుకొని లాభం ఏమిటి? అంటే.. అంతరిక్ష వాహక నౌకల్లో వ్యోమగాములు ఎదుర్కొనే ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటార్కిటికా చలికాలం సీజన్ సందర్భంగానూ తలెత్తుతాయి. ఈక్రమంలో అక్కడికి వ్యోమగాములను, అంతరిక్ష శాస్త్రవేత్తలను శిక్షణ నిమిత్తం పంపుతుంటారు. తద్వారా అంతరిక్ష వాహక నౌకల్లో ఎలా ఉండాలి ? ప్రతికూల వాతావరణంలో, ఎలా రోజులు గడపాలి ? అనే దానిపై వ్యోమగాములకు మంచి అవగాహన వస్తుంది. భవిష్యత్ లో అంగారకుడు లక్ష్యంగా చేపట్టే మిషన్ శిక్షణ కోసం అంటార్కిటికా చలికాలం రాత్రులు వేదికగా ఉపయోగపడతాయి.