Territorial Army : ఇకపై పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు ఎదురైన సందర్భాల్లో మరింత సమర్థంగా స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ ద్వారా దాడులకు తెగబడిన నేపథ్యంలో, భారత ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్న భారత్.. ఇక మళ్లీ అలాంటి ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకూడదనే దృష్టితో ఆర్మీని మరింత దృఢంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా ఆదేశాలతో భారత ఆర్మీ చీఫ్‌కి అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ (ప్రాదేశిక సైన్యం)ని రంగంలోకి దించే అధికారం లభించింది. ఇందులో ఉన్న అధికారులను, సిబ్బందిని అవసరాన్ని బట్టి పిలవొచ్చు. రెగ్యులర్ ఆర్మీతో కలిపి సమన్వయంగా పని చేయాలని కేంద్రం సూచించింది.
Read Also: AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది.టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక రిజర్వ్ సైనిక దళం. అత్యవసర సమయంలో, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేస్తుంది. 1948లో చట్టం ద్వారా ఏర్పాటైన ఈ దళం, 1949లో అధికారికంగా పని ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఇందులో సేవలు అందిస్తున్నారు. వీరంతా రెగ్యులర్ ఆర్మీ తరహాలో శిక్షణ పొందినవారు. సాధారణంగా ఇతర ఉద్యోగాలు చేస్తూ, అవసరమైన సమయంలో మాత్రమే సైనిక సేవలు అందిస్తారు.
ఇప్పటివరకు 1962, 1965, 1971 యుద్ధాల్లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కేరళలో వచ్చిన భారీ వరదల్లో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన స్టార్ హీరో మోహన్ లాల్ సేవలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు. అలాగే మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రాజకీయ నేతలు సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా వంటి పలువురు ప్రముఖులు టెరిటోరియల్ ఆర్మీకి చెందినవారే. ఈ సేవలో ఉండేవారికి పింఛన్‌తోపాటు క్యాంటీన్, మెడికల్, ట్రావెల్ అలవెన్సుల వంటి ఇతర ప్రయోజనాలు అందుతాయి. దేశానికి తిష్టగా నిలబడ్డ ఈ దళాన్ని కేంద్రం తిరిగి మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాక్ మరోసారి కుట్రలకు పాల్పడకముందే, భారత ఆర్మీ పూర్తిగా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
Read Also: IPL Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ బిగ్ అప్డేట్!