MahaKumbh Mela : కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నా.. ప్రయాగ్ రాజ్‌కు భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు.
కాగా, ప్రయాగ్‌రాజ్‌లో తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది.
మరోవైపు మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా 29వ తేదీ అంటే బుధవారం సంగమం వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. దాదాపు 40 మంది గాయపడ్టట్లు వెల్లడించారు. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి అగ్నిప్రమాదం సంభవించడంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.