Delhi Polls : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ”జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్”లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 5వ తేదీతో ‘ఆప్-దా’ నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని అమిత్‌షా జోస్యం చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘ఆప్’ను విపత్తు (ఆప్-దా)గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించినప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ పదాన్ని విరివిగా వాడుతున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే కాకుండా ఆయన పార్టీకి కూడా విపత్తేనని అన్నారు.
ఒక చెడు రాజకీయనేతకు ఎన్ని అవలక్షణాలు ఉంటాయే అన్నీ ఆయనకు ఉన్నాయని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత అని విమర్శలు గుప్పించారు. బీజేపీ మేనిఫెస్టో అంటే ప్రధాన మంత్రి గ్యారిటీ. ‘ఆప్-దా’ మేనిఫెస్టో తరహాలా ఉండదు. మేము చేసేదే చెబుతాం అని అమిత్‌షా అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ స్లమ్ వాసుల ఆవేదన, ఆగ్రహం బీజేపీ ఆలకించింది. మీ సమస్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి మోడీ ముందుకు తీసుకెళ్లింది. ఆ సమస్యలన్నింటికీ ఉపశమనం మా మేనిఫెస్టిలో ఉంటుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించిన వాళ్లే (ఆప్) అవినీతి రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టారని, ఢిల్లీకి ‘ఆప్’ ఒక విపత్తు అయితే, అరవింద్ కేజ్రీవాల్ సొంత పార్టీకి (ఆప్)కి కూడా విపత్తేనని అమిత్‌షా అన్నారు.
‘అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు అన్నా హజారే లాంటి సాధువులను ముందుకు తెచ్చి అధికారంలోకి వచ్చి దేశంలోని అవినీతి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేంత అవినీతికి పాల్పడ్డారు. ఈ రోజు నేను ఆప్ పార్టీ సభ్యులకు చెబుతున్నాను.. మీరు ఢిల్లీ ప్రజలకు ఆప్-దా అయ్యారు… అంతే కాదు, కేజ్రీవాల్ ఎక్కడికి వెళ్లినా, సిసోడియా ఎక్కడికి వెళ్లినా… ఢిల్లీ వాసులు మద్యం బాటిళ్లను చూస్తారు అని ఆయన అన్నారు.
Read Also: Names Vs Songs : ఈ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు.. పాట పాడి పిలుస్తారు