USA in India-Canada Row : భారత్ – కెనడా వివాదంపై అమెరికా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు విషయంలో కెనడాకు భారత్ సహకరించడం లేదని అమెరికా వ్యాఖ్యానించింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా చేస్తోన్న ఆరోపణలను ప్రధాని మోడీ తీవ్రంగా పరిగణిస్తూ ఆ కేసు దర్యాప్తులో సహకరించాలని అమెరికా అభిప్రాయపడింది. మంగళవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడారు. ఈ సమావేశంలో అమెరికా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మాథ్యూ మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది.
మరోవైపు భారత్-అమెరికా దౌత్య సంబంధాలపై కూడా మిల్లర్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరుదేశాల బంధం బలంగా ఉందన్నారు. ”భారత్ మా శక్తిమంతమైన భాగస్వామిగా కొనసాగుతోంది. సమష్టి లక్ష్యాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వంటి పలు అంశాల్లో మేము కలిసి పనిచేస్తున్నాం. ఇరుదేశాలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తంచేసే పరిస్థితి ఉంది” అని ఆయన అన్నారు.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో గతేడాది జూన్‌లో నిజ్జర్ హత్య జరిగింది. ఆ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్‌తో పాటు పలువురు దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల పేర్లను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేర్కొంటూ కెనడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను పిలిచి ఉన్న విషయాన్ని స్పష్టంచేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నట్లుగా భారత్ పేర్కొంది.
ఖలిస్థాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత్‌కి ముడిపెడుతూ కెనడా చేసిన ఆరోపణలు భారత్ – కెనడా మధ్య దూరం పెంచాయి. కెనడా చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. నిరాధారమైన ఆరోపణలతో కెనడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే రీతిలో వ్యవహరిస్తోందని భారత్ అభిప్రాయపడింది. అంతేకాకుండా కెనడా ప్రస్తుతం వ్యవహరిస్తోన్న తీరు చూస్తోంటే భారత దౌత్యవేత్తలకు అక్కడ రక్షణ కల్పించే అవకాశం కనిపించడం లేదని చెబుతూ భారత్ వారిని వెనక్కి పిలిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. కెనడా దౌత్యవేత్తలను కూడా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా తేల్చిచెప్పింది. భారత్ చర్యలకు ప్రతిస్పందన అటువైపు కెనడా కూడా భారత దౌత్యవేత్తల విషయంలో అదే నిర్ణయం తీసుకుంది.