Assembly elections : ఎన్‌సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ అర్వింద్ కేజ్రీవాల్‌కు సహకరించాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా.. లేదంటే కలిసి పోటీ చేయాలా అనేది చర్చల ద్వారా నిర్ణయించాల్సి ఉందన్నారు. వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఇండియా కూటమిలో రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రం కలిసికట్టుగా పనిచేస్తుందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సహకరించాలనేది తన అభిప్రాయమని శరద్ పవార్ చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములే అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లలేదు. దాంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సహకరించాలనేది తన అభిప్రాయం అనడం చర్చనీయం అయింది.