Site icon HashtagU Telugu

China’s ‘Ground Strike Plan’: తైవాన్ పై భూతలదాడికి డ్రాగన్ ప్లాన్.. ఆడియో లీక్ కలకలం!!

Indian Navy

China Navy

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినట్టే .. తైవాన్ పై చైనా దాడి చేయబోతోంది అంటూ గతంలో పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుకు సంబంధించిన పలు ఆధారాలు (ఆడియో, వీడియో) కూడా వెలుగులోకి వచ్చాయి. ‘ తైవాన్ పై భూమార్గంలో దాడి చేసేద్దాం.. అందుకు అవసరమైన ఆయుధాలన్నీ సిద్ధం చేసుకుందాం. తైవాన్ పై నిఘా, మ్యాపింగ్ కు సంబంధించిన ప్లానింగ్ ను తొలుత తయారు చేసుకోవాలి’ అని చైనా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది.

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దురాక్రమణ వాదానికి చైనా వత్తాసు పలుకుతుందనే ఆరోపణలన్నీ నిజమని నిరూపించేలా ఈ ఆడియో క్లిప్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ‘తైవాన్ పై దాడి కోసం జౌ ఆర్బిట, షేంజెన్ ఏరో స్పేస్ డాంగ్ ఫాన్గ్యాంగ్ శాటిలైట్ , ఫోశాన్ దెలియ, జీ హువా లేబొరేటరీ అనే 4 రక్షణ రంగ సేవల కంపెనీలతో ప్రత్యేక యూనిట్లను తైవాన్ సరిహద్దులో ఏర్పాటు చేయిద్దాం’ అని పలువురు సైనిక అధికారులు చెప్పడాన్ని ఆ వీడియోలో వినొచ్చు.
1.40 లక్షల సైన్యంతో..
తైవాన్ పై దాడి కోసం 1.40 లక్షల సైన్యం, 953 నౌకలు, 20 విమానాశ్రయాలు, నౌకా కేంద్రాలు, 6 నౌకా నిర్మాణ యార్డ్ లను చైనా సిద్ధం చేస్తోందని అమెరికా మీడియా కథనాన్ని ప్రచురించింది. 64 నౌకలు,38 విమానాలు, 588 ట్రైన్ బోగీలను డ్రాగన్ సమకూర్చుకుంటోందని వివరించింది. అత్యవసరంగా ధాన్యం, నిత్యావసరాలు, రక్తం సరఫరాకు కూడా ఏర్పాట్లు చేస్తోందని పేర్కొంది. తైవాన్ సరిహద్దులకు సమీపంలోని చైనా ప్రావిన్స్ లలో యుద్ధం కోసం ప్రత్యేక పెట్రోల్ బంక్ లు, ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, చమురు డిపోలను చైనా సమాయత్తం చేస్తోందని అంటున్నారు. తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో కొత్త యుద్ధ ప్రాతిపదికన మరో 15,00 మందిని సైన్యంలో భర్తీ చేసుకునేందుకు కసరత్తు కూడా మొదలైందని అంటున్నారు.

ఓ వీడియోలో చైనా నౌకాదళ రవాణా ఓడలోకి యుద్ధ ట్యాంకుల్లో కూర్చున్న సైనికులు ప్రవేశిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తైవాన్ సరిహద్దులకు వెళ్లేందుకే ఈ సన్నద్ధత అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమేరకు వాస్తవం ఉంది ? అనే విషయం తెలియాల్సి ఉంది.

Cover Pic: China Military

https://twitter.com/yin_sura/status/1528375100063490050

Exit mobile version