Ajit Pawar : మహారాష్ట్రలో “మహాయుతి” కూటమి 236 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సీఎం పదవి రేసులో ఫడ్నవీస్ ముందున్నారు. సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి సీఎం పదవి రావాలని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అంశంపై అజిత్ పవార్ స్పందించారు. భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు. అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా తనను తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఎన్నికైనట్లు తెలిపారు.
మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి ఆ తర్వాత 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు. సీఎం ఎవరనేది అంతిమంగా ఢిల్లీలో నిర్ణయిస్తారని, చర్చలు జరుగుతున్నందున ఫలితం ఏమిటనేది వేచిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున దానిని కూడా సీఎం ఎంపిక విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంగళవారానికి ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Read Also: Aditya Thackeray : SS-UBT లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఆదిత్య థాక్రే