Site icon HashtagU Telugu

Kolkata Case : సుప్రీంకోర్టు ఆదేశాలు.. సమ్మె విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు

AIIMS doctors end strike after Supreme Court order in Kolkata rape case

AIIMS doctors end strike after Supreme Court order in Kolkata rape case

Kolkata Case : కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన(Kolkata Doctor Rape Murder) పై వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (FAIMA) ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హామీ, ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే ఆర్‌జి కార్‌ ఆస్పత్రి ఘటనలో జోక్యం చేసుకుంటామని, వైద్యుల భద్రతకు సుప్రీంకోర్టు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. కోర్టు చర్యలను అభినందిస్తున్నామని, ఆదేశాలను పాటిస్తామని అన్నారు. రోగులకు చికిత్సనందించడమే తమ మొదటి ప్రాధాన్యతని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక.. విద్యార్థులు చేపడుతున్న నిరసనలు ప్రజారోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వైద్యులు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ ఆదేశించారు. శాంతియుత ఆందోళనలపై నిర్బంధ చర్యలు చేపట్టకూడదని ప్రభుత్వాలను ఆదేశించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం.. ఆందోళనల కారణంగా పేదలు నష్టపోకూడదని వ్యాఖ్యానించింది. వెంటనే విధుల్లో చేరాలని.. ఆందోళనలు చేపట్టిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఆందోళనలు విరమించారు.

Read Also: Kolkata Case : అత్యాచారాల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలి..ప్రధానికి దీదీ లేఖ