Air India : దేశీయ విమానయాన రంగంలో ప్రఖ్యాతి గాంచిన ఎయిరిండియా సంస్థ ఇటీవలి కాలంలో వరుసగా ఎదురవుతున్న సాంకేతిక లోపాలు, ప్రమాదాల వల్ల ప్రయాణికుల మధ్య భయాందోళన కలుగజేస్తున్నాయి. ఇప్పటికే ఒక ఘోర విమాన ప్రమాదం మరువకముందే, తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం వెలుగులోకి రావడం తీవ్ర కలవరానికి కారణమైంది. గత వారం జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. పైగా విమానం ఓ నివాస సముదాయంపై పడటంతో అక్కడ నివసిస్తున్న ఇంకా 33 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై ఆందోళన కలిగించింది.
ఈ ఘోర ఘటన అనంతరం AI-171 ఫ్లైట్ నంబర్‌ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్‌తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో టేకాఫ్‌కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర్తించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై టేకాఫ్‌ను నిలిపివేసి, విమాన సర్వీసును రద్దు చేశారు. ఇది లండన్‌కు విమాన ప్రమాదం తరువాత వెళ్లాల్సిన మొదటి షెడ్యూల్డ్ విమానం కావడం గమనార్హం. అయినప్పటికీ మళ్లీ అదే దిశగా సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో, ప్రయాణికుల భద్రతపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే టికెట్లు బుక్కింగ్ చేసుకున్న ప్రయాణికులు, కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇదే సమయంలో, మరొక ఎయిరిండియా విమానం AI-180, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వెళ్లాల్సిన ఫ్లైట్‌లోనూ సాంకేతిక లోపం ఎదురైంది. దీనిని తక్షణమే కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని ఖాళీ చేయించి, ప్రయాణికులను భద్రంగా బయటకు తరలించారు. అనంతరం ఆ విమానాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. ఈ వరుస సాంకేతిక లోపాలు ఎయిరిండియా నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ వంటి ఆధునిక వాహనాల్లో ఇలాంటి సమస్యలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విమానయాన నియంత్రణ సంస్థలు కూడా ఈ అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎయిరిండియా అధికారులు ఎటువంటి స్పష్టమైన వివరణ ఇవ్వకుండా, సాధారణ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సంస్థ పటిష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. భద్రతా ప్రమాణాలపై సమీక్షలు జరిపి, తనిఖీలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ ఈ ధోరణి కొనసాగితే, ఎయిరిండియా గ్లోబల్‌గా విమానయాన రంగంలో తన స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రయాణికుల ప్రాణాలను ప్రాధాన్యంగా పరిగణించాల్సిన సంస్థ, తమ నిర్వహణలోని లోపాలను తక్షణమే సవరించాలి.
Read Also: Russia- Ukrain : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి