Flight Crash : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడితో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్రమంత్రికి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Ahmedabad Plane Crash: కేవలం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!
అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. లండన్‌కు బయలుదేరే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చెట్టు ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక, అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయని ఎయిర్‌పోర్టు ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అమిత్ షా తదితరులు ఈ ప్రమాదంపై సమీక్షలు నిర్వహించి, బాధితులకు సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నాట్టు సమాచారం. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్ జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయన పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
Read Also: Ukraine : రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త పథకం