Site icon HashtagU Telugu

Female Fight Pilot:మొట్టమొదటి మహిళా ‘యుద్ధ విమాన పైలట్’ గా అభిలాష బరాక్

Abhilasha

Abhilasha

మహిళామణులు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. యుద్ధ విమానం నడిపే “కంబ్యాట్ ఏవియేటర్” పోస్టులో తొలిసారిగా ఒక మహిళ నియమితులయ్యారు. ఆమె పేరు కెప్టెన్ అభిలాషా బరాక్(26) . దీనికి సంబంధించిన శిక్షణను మహారాష్ట్ర లోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో ఆమె పూర్తి చేసుకున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్, కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ అధికారి..అభిలాషాకు “వింగ్స్” బ్యాడ్జి ప్రదానం చేశారు. విజయవంతంగా శిక్షణ ముగించిన మరో 36 మంది ఆర్మీ పైలట్లకు కూడా అధికారులు బ్యాడ్జీలు ప్రదానం చేశారు.

సైనిక ఏవియేషన్ చరిత్రలో “గోల్డెన్ లెటర్ డే అంటూ” భారత ఆర్మీ ఈసందర్భంగా ట్వీట్ చేసింది. ఇంతకు ముందు, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో మహిళలు కేవలం గ్రౌండ్ డ్యూటీలలో భాగంగా ఉండేవారు. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో కంబాట్ ఏవియేటర్ శిక్షణ నిమిత్తం మొత్తం 15 మంది మహిళా అధికారులు ఆసక్తి కనబరిచారు. అయితే పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్టుల్లో గత ఏడాది జూన్ లో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. వీరు నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ఆ ఇద్దరిలో ఒక్కరే.. కెప్టెన్ అభిలాషా బరాక్!2018లో ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. కాగా, ప్రస్తుతం ఆర్మీ విమానయాన విభాగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ డ్యూటీ బాధ్యతలను మహిళలకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఇకపై ఆర్మీ పైలట్లు గానూ వారు రాణించనున్నారు.