Site icon HashtagU Telugu

Inspire Job Seekers: నిరుద్యోగులకు హాట్ స్పాట్ ‘ఆ ఇల్లు’

Machiryala

Machiryala

మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో పాడుబడిన ఇల్లు నిరుద్యోగ యువకులకు హాట్‌స్పాట్‌గా మారింది. అయితే ఇంట్లో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ కల నెరవేరడంతో ఆ ఇల్లు నేటి యువతకు సెంటిమెంట్ గా మారింది. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపరయ్యే అభ్యర్థులు శుభసూచకంగా భావించి, అక్కడే చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు.

80,039 ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించడంతో.. స్థానిక నిరుద్యోగులు పులి రాజమల్లుకు చెందిన ఈ ఇంటిని అడ్డగా మార్చుకున్నారు. నిరుద్యోగుల కోసం దాతలు కూడా ముందుకొచ్చి స్టడీ మెటిరీయల్స్, ఇతర పుస్తకాలను ఆ ఇంట్లో భద్రపరుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆ ఇల్లు పేదోడి కోచింగ్ సెంటర్ గా పేరు తెచ్చుకుంది. పాతికేళ్ల క్రితం మొదటిసారిగా ఇంటిని ఉపయోగించిన ఐదుగురు యువకులు తమ తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఇల్లు అదృష్టమనే నమ్మకం మొదలైంది. అప్పటి నుండి, కనీసం 55 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలలో విజయం సాధించారు. రాజమల్లు కూడా ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగంలో చేరాడు.

ఉద్యోగాలు పొందిన వారు స్వచ్ఛందంగా వారానికోసారి అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉద్యోగం కోసం ఏవిధంగా కష్టపడాలి? పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గాలి? అనే విషయాలపై పాఠాలు చెప్తారు. బోయపల్లికి చెందిన నిరుద్యోగ యువకుడు ఇందూరి సంతోష్‌ మీడియాతో మాట్లాడుతూ రానున్న పరీక్షల కోసం ఈ ఇంటి నుంచే ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు. అంతేకాదు.. నాలాంటి యువకులకు ఈ ఇల్లు సెంటిమెంట్ గా మారిందని, మంచి స్టడీ సెంటర్ గా ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశాడు.

Exit mobile version