Site icon HashtagU Telugu

Third Marriage: ఇద్దరు భర్తలకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో యువతి పెళ్లి!

Marriage

Marriage

మోసపోవడానికి అమాయకత్వం చాలు. కానీ మోసం చేయడానికి తెలివి కచ్చితంగా అవసరం. ఆ యువతిని చూస్తే అర్థమవుతుంది. నంద్యాల జిల్లా మిట్నాల గ్రామవాసి అయిన శిరీషకు 24 ఏళ్లు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ వారిలో ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. పైగా మరొకరిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె తల్లి ప్రవర్తనతో మూడో భర్తకు అనుమానం వచ్చింది. అక్కడే శిరీష అసలు భాగోతం బయటపడింది.

మేరీ జసింట అలియాస్ మేరమ్మ కూతురే శిరీష. ఆమెకు ఇంతకుముందే అవుకు మండలం చెన్నంపల్లి వాస్తవ్యుడైన పాణ్యం మల్లిఖార్జునతో పెళ్లి జరిగింది. కానీ ఆయనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి సిద్ధపడింది. ఆత్మకూరు మండలం కొత్తపల్లె నివాసి అయిన శ్రీనివాసరెడ్డిని రెండో వివాహం చేసుకున్నా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. రెండో భర్తకు కూడా విడాకులు ఇవ్వలేదు. ఈలోపే మరొకరిని మూడో పెళ్లి చేసుకుంది.

బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో ఉండే వాసి మహేశ్వరరెడ్డి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో శిరీష సంబంధం వచ్చింది. కానీ తనకు సెక్యూరిటీగా రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని శిరీష తెగేసి చెప్పింది. సరే తనకు కూడా రెండో పెళ్లి అయినందున.. మరో మాట మాట్లాడకుండా ఫిబ్రవరి 1న రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. అది జరిగిన నాలుగు రోజులకు.. అంటే ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది.

శిరీష తల్లి అయిన మేరమ్మ మాత్రం తరచూ కూతురింటికి వచ్చేది. శిరీషను అత్తారింట్లో ఉంచాలంటే ఇంకా డబ్బివ్వాలని, ఆస్తి కూడా రాసివ్వాలని డిమాండ్ చేయడంతో మహేశ్వరరెడ్డికి అనుమనం వచ్చింది. అప్పుడు శిరీష గురించి పూర్తి వివరాలు వాకబు చేశాడు. ఆమెకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఆయనకు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు.