Suicide Bomber : ఇద్దరు పిల్లల తల్లి, ఉన్నత విద్యావంతురాలు, భర్త డాక్టర్.. అయినా సూసైడ్ బాంబర్ గా మారింది!!

ఆమె ఇద్దరు పిల్లల తల్లి.. స్వయానా ఒక టీచర్.. ప్రస్తుతం జువాలజీలో ఎంఫిల్ చేస్తోంది.. భర్త ఒక డాక్టర్.. తండ్రి ఒక లెక్చరర్ !! చుట్టూ ఉన్నత విద్యావంతులు, కంటిపాపల్లాంటి ఇద్దరు పిల్లలు, సౌకర్యవంతమైన జీవితం ఉన్నా.. ఆమె సూసైడ్ బాంబర్ గా మారింది.

  • Written By:
  • Updated On - April 27, 2022 / 02:33 PM IST

ఆమె ఇద్దరు పిల్లల తల్లి.. స్వయానా ఒక టీచర్.. ప్రస్తుతం జువాలజీలో ఎంఫిల్ చేస్తోంది.. భర్త ఒక డాక్టర్.. తండ్రి ఒక లెక్చరర్ !! చుట్టూ ఉన్నత విద్యావంతులు, కంటిపాపల్లాంటి ఇద్దరు పిల్లలు, సౌకర్యవంతమైన జీవితం ఉన్నా.. ఆమె సూసైడ్ బాంబర్ గా మారింది. బురఖా ధరించి పాకిస్థాన్ లోని కరాచీ యూనివర్సిటీ లోకి వెళ్లి తనను తాను పేల్చుకుంది. ఈ ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనా ట్యూటర్లు మరణించగా, వారికి డ్రైవర్ గా పనిచేసే ఒక స్థానికుడు హతమయ్యాడు. మరెంతో మందికి గాయాలయ్యాయి. ఇంతకీ ఎవరు ఆమె అంటే.. “షారీ బెలూచ్”. ఒక 30 ఏళ్ల ఉన్నత విద్యావంతురాలు. సూసైడ్ బాంబర్ గా “షారీ బెలూచ్” ఎందుకు మారింది ? అనేది తెలుసుకునేందుకు మీడియా సంస్థలు ప్రయత్నించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.

కుటుంబ నేపథ్యం..

“షారీ బెలూచ్” బలూచిస్థాన్‌ ప్రావిన్స్ లోని టుర్బాట్‌ నగరం పరిధిలో ఉన్న నియాజర్ అబద్‌ ప్రాంతవాసి. జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ప్రస్తుతం ఎంఫిల్‌ చేస్తోంది. గతంలో ఒక పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలిగానూ పని చేసింది. ఓ వైద్యుడిని పెళ్లాడిన షారీ బెలూచ్‌కు 8 సంవత్సరాలు, 5 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త పేరు హబిటాన్‌ బషీర్‌ బలోచ్‌.. డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. షారీ బెలూచ్‌ తండ్రి లెక్చరర్‌.

సూసైడ్ బాంబర్ గా ఎందుకు మారింది ?

బెలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ గత కొన్ని దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోంది. పాకిస్థాన్ సైన్యం వెంటనే బెలూచిస్తాన్ నుంచి వైదొలగాలనే డిమాండ్ చాలా పాతదే. బెలూచిస్తాన్ లో ఉన్న సహజ వనరులను పాకిస్థాన్ ప్రభుత్వాలు అక్రమంగా చైనాకు కట్టబెడుతున్నాయని స్వతంత్ర బెలూచిస్తాన్ ఉద్యమ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై బెలూచిస్తాన్ కేంద్రంగా యువత పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈక్రమంలోనే ఎంతోమంది బెలూచిస్తాన్ యువత ఉగ్రవాద సంస్థల కోరల్లో చిక్కుతున్నారు. “షారీ బెలూచ్” కూడా ఇదే విధమైన భావజాలం తో.. రెండేళ్ల క్రితం బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) అనే ఒక ఉగ్రవాద దళంలో చేరింది. బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ లో మజీద్‌ బ్రిగేడ్‌ అనే ప్రత్యేక దళం ఉంది. ఇందులో ప్రత్యేకించి సూసైడ్ బాంబర్ల ( ఫిదాయిన్ల)కు శిక్షణ ఇస్తారు. ఇందులో చేరుతానంటూ “షారీ బెలూచ్” చేసిన విజ్ఞప్తిని తొలుత బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తిరస్కరించింది. ఇద్దరు పిల్లలు ఉన్నందున ఫిదాయిన్ గా మారొద్దని సూచించింది. అయినా..
“షారీ బెలూచ్” వినలేదు. ఎలాగైనాఫిదాయిన్ గా మారుతానని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను ఫిదాయిన్ బ్రిగేడ్ లో చేర్చుకొని బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ శిక్షణ ఇచ్చింది. ఆమె మంగళవారం కరాచీ వర్సిటీ లోని “కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్” లో తనను పేల్చుకుంది. మీడియాలో ఈవార్త రాగానే ఆ సూసైడ్ బాంబర్ తమ దళానికి చెందిన సభ్యురాలేనని బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది.

చైనా కు వార్నింగ్..

చైనీయులు తీరు మార్చుకోకుంటే.. వారిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు చేసేందుకు వేలాది మంది ఫిదాయిన్లు సిద్ధంగా ఉన్నారని బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ హెచ్చరించింది. బలూచిస్థాన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టం చేసింది. శాంతియుతంగా బెలూచిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. బెలూచిస్తాన్ లో పాక్ సాగిస్తున్న మారణహోమానికి చైనా సైనిక సహకారం అందిస్తోందని ఆరోపించింది.