Site icon HashtagU Telugu

Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు

A key turning point in Maharashtra politics.. Brothers and sisters on the same platform after 20 years

A key turning point in Maharashtra politics.. Brothers and sisters on the same platform after 20 years

Raj Thackeray : దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు ముంబయిలో జరిగిన ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్గాన్ని తెరలేపింది. మహారాష్ట్ర మంత్రివర్గం త్రిభాషా విధానం అమలును ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, ఈ కార్యక్రమం ప్రతిపక్షాల విజయోత్సవ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్‌ ఠాక్రే (ఎంఎన్ఎస్‌) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్‌ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ విభేదాల తర్వాత ఇదే తొలిసారి వీరు పబ్లిక్‌గా ఒకే వేదికపై కనిపించడం విశేషం.

Read Also: Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు

ఈ కార్యక్రమంలో రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ..త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నందున అసలు విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే వాదనను మోడీ ప్రభుత్వం అనవసరంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు, సినీనటులు ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదివినా, వారి మాతృభాషలపై గౌరవం తక్కువ కాలేదని తెలిపారు. మరాఠీలకూ తమ భాషపై అపారమైన గౌరవముందని, హిందీ భాషపై తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు రాజ్‌. అయితే హిందీని బలవంతంగా మిగతా రాష్ట్రాలపై రుద్దాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. మరాఠా సామ్రాజ్యం విస్తరించిన ప్రతి ప్రాంతంలో కూడా స్థానికులపై మరాఠీని రుద్దలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు భాషల విధానాన్ని ప్రభుత్వంగా అమలు చేయాలన్న ఆశతో ముందుకు సాగుతోంది అని విమర్శించారు.

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సహా దేశంలోని ఇతర హైకోర్టులన్నీ ఇప్పటికీ ఆంగ్లంలోనే ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రపైనే ఈ విధానం బలవంతంగా అమలు చేయాలని చూస్తే దాని తీవ్రత కేంద్రానికి త్వరలోనే అర్థమవుతుందని హెచ్చరించారు. అంతేకాక మమ్మల్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ఎవరూ చేయలేకపోయారు. తండ్రి బాల్‌ ఠాక్రేగారు కూడా చేయలేకపోయినదాన్ని.. ఫడణవీస్‌ చేసిన తప్పు వల్ల జరిగింది అని రాజ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. త్రిభాషా విధానంపై తీసుకున్న నిర్ణయంతోనే తమ కలయిక సాధ్యమైందని అన్నారు. ఈ ఘటన రాజకీయంగా చూస్తే, మహారాష్ట్రలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఈ కలయిక ఎప్పటికీ తాత్కాలికమా? లేక దీర్ఘకాల రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయినా, ఇటువంటి క్షణాలు మహారాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మకంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

Read Also :  Jharkhand : ఝార్ఖండ్‌ బొగ్గుగనిలో ప్రమాదం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు