Corona Effected: కరోనా బారినపడిన పురుషులకు ఒక బ్యాడ్ న్యూస్!

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 07:00 PM IST

చైనాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో భారతదేశంలోనూ వాటి వ్యాప్తికి అవకాశం ఉంది.ఈనేపథ్యంలో  ఆంధ్రాలోని మంగళగిరి, బీహార్ లోని పాట్నా, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కోవిడ్ -19 అనేది పురుషులలో స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఇందులో గుర్తించారు. ఈ అధ్యయనం వీర్యం విశ్లేషణ, స్పెర్మ్ కౌంట్ పరీక్ష ఆధారంగా పై అభిప్రాయానికి వచ్చింది. ఈ అధ్యయనంలో భాగంగా అక్టోబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు పాట్నా ఎయిమ్స్‌లో కరోనా చికిత్స పొందిన 19 నుంచి 43 సంవత్సరాల 30 మంది పురుషుల ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించారు.

అధ్యయనం ఇలా జరిగింది..

వీరికి మొదటి పరీక్ష కరోనా ఇన్ఫెక్షన్ అయిన వెంటనే జరిగింది. ఆ తర్వాత రెండవ టెస్ట్ ఇన్ఫెక్షన్ రెండు మూడు నెలల తర్వాత జరిగింది. ఇందులో రోగులందరి వీర్యం సేకరించారు.మొదటి నమూనాలో, ఈ రోగులందరి వీర్యం నాణ్యత చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే రెండవ నమూనా ఫలితం మరింత దారుణంగా వచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న 10 వారాల తర్వాత కూడా 30 నుంచి 40 శాతం మంది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగానే ఉంటుందని అధ్యయనంలో తేలింది. పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన 33 శాతం మంది రోగుల నుంచి సేకరించిన మొదటి నమూనాలోనూ వీర్యం మోతాదు సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.
వీర్య విశ్లేషణలో స్పెర్మ్ యొక్క మూడు ప్రధాన కారకాలను కొలుస్తారు. అవి స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ ఆకారం, స్పెర్మ్ చలనశీలత. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “క్యూరియస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్‌”లో పబ్లిష్ అయింది.

40 శాతం మందికి తక్కువ స్పెర్మ్ కౌంట్..

ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. మొదటి వీర్యం నమూనాలో 30 మంది పురుషులలో 40 శాతం (12) మందికి తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నట్లు కనుగొనబడింది.  రెండున్నర నెలల తర్వాత కూడా ముగ్గురు (10 శాతం) పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది. 30 మందిలో 10 మంది (33 శాతం) పురుషులలో మొదటి వీర్యం నమూనాలో 1.5ml కంటే తక్కువ వీర్యం ఉందని అధ్యయనం కనుగొంది. ఇది సాధారణంగా అయితే 1.5 నుంచి 5ml మధ్య ఉండాలి. దీనితో పాటు అధ్యయనంలో పాల్గొన్న 30 మంది పురుషులలో 26 మంది వీర్యం యొక్క మందం, 29 మందిలో స్పెర్మ్ కౌంట్, 22 మందిలో స్పెర్మ్ కదలిక ప్రభావితమైనట్లు మొదటి వీర్య నమూనాలో వెల్లడైంది. రెండవ పరీక్షలో పరిస్థితి మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ సాధారణం కంటే చాలా తక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

ART క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకులు..

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకులు కోవిడ్-19తో బాధపడుతున్న పురుషుల వీర్యాన్ని అంచనా వేయాలని ఈ అధ్యయన బృంద అధిపతి డాక్టర్ సతీష్ పి దీపాంకర్ సూచించారు. వీర్యం నాణ్యత సాధారణమయ్యే వరకు ఈ పరిశోధన కొనసాగించాలి.
సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఐవీఎఫ్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుదలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతు న్నాయన్నారు.  దీనితో పాటు, ఈ అన్ని అధ్యయనాల డేటాబేస్ కూడా తయారు చేయబడుతోంది. డాక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రధానంగా ఐవీఎఫ్‌కి ముందు పురుషుల వీర్యం నాణ్యతను తనిఖీ చేయాలని సిఫార్సు చేస్తున్నాడు.