5 Planets: ఒకే లైన్లో క్యూ కట్టనున్న 5 గ్రహాలు.. జూన్ 24న ఇలా చూడండి!!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 గ్రహాలు ఒకే రేఖ (లైన్) పైకి వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - June 8, 2022 / 12:44 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 గ్రహాలు ఒకే రేఖ (లైన్) పైకి వస్తున్నాయి. సాధారణంగా శుక్రగ్రహం (వీనస్), గురుగ్రహం (జూపిటర్), శనిగ్రహం (స్యాటర్న్) తరచూ మనకు ఒకే లైన్ లో కనిపిస్తూ ఉంటాయి. కానీ అంగారకుడు (మార్స్), బుధగ్రహం (మెర్క్యూరీ) కూడా ఒకే లైన్ లోకి చేరి కనిపించడం ఈసారి విశేషం. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఘట్టం చోటుచేసుకుంటోంది. జూన్ 24న ఈ అంతరిక్ష అద్భుతాన్ని మన కళ్లతోనే చూడొచ్చు. ఆ రోజున తెల్లవారు జామున, సూర్యోదయానికి ముందు ఈ అంతరిక్ష దృశ్యాన్ని చూడగలం. బైనాక్యులర్ లేదా 60 రెట్లు జూమ్ చేసే కెమెరా ఉంటే గ్రహాలను బాగా చూడొచ్చు.

ఇలా చూద్దాం…

24న వేకువజామున లేచి డాబా పైకి వెళ్ళండి. తూర్పు దిక్కుకు తిరిగి చూడండి. చందమామ మీకు నెలవంకలాగా కనిపిస్తుంది. చందమామ నుంచి కుడివైపున కాస్త పైన అంగారక గ్రహం
మెరుస్తూ కనిపిస్తుంది. అదే వరుసలో మరికాస్త పైన మెరుస్తూ గురుగ్రహం తారసపడుతుంది. గురుగ్రహం వరుసలోనే చూస్తూ.. కుడివైపునకు వెళితే శనిగ్రహాన్ని చూడొచ్చు. ఇప్పటివరకు చందమామ కుడివైపున చూశారు. ఇప్పుడు చందమామకు ఎడమ వైపున కింది భాగంలో చూడండి. తొలుత శుక్రగ్రహం, దాని కింద బుధ గ్రహం నిలువు వరుసలో కనిపిస్తాయి.