పట్టుదల ఉంటే కొండలనైనా పిండి చేసే వయసు. పేదరికం చాచి కొడుతున్నా ఆత్మాభిమానంతో దానిని అడ్డుకునే వయసు. సంకల్పం ఉంటే.. విధి సైతం చేతులెత్తి నమస్కరించే మనసు. ఒక వ్యక్తి జీవితంలో గెలవాలంటే ఇంకేం కావాలి. మేం మీకు చెప్పబోయేది అలాంటి బతుకువీరుడి జీవితం గురించే. ఢిల్లీకి సమీపంలో నోయిడా దగ్గర ఓ 19 ఏళ్ల కుర్రాడు భుజానికి బ్యాగ్ తగిలించుకుని.. అలుపెరగకుండా పరిగెడుతున్నాడు. అది చూసిన దర్శకుడు వినోద్ కప్రి.. ఆ పరుగెందుకో కనుక్కోవాలనుకున్నాడు. ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అర్థరాత్రి వేళ రోడ్లపై పరిగెడుతూనే ఉన్న ఆ కుర్రాడి పేరు ప్రదీప్. ఎందుకలా పరిగెడుతున్నావ్ అని వినోద్ అడిగితే.. రోజూ ఇలాగే ఇంటివరకు పరిగెడతానని.. ఆర్మీలో చేరడానికి ఇది ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని చెప్పాడు. సెక్టార్ 16లో ఉన్న మెక్ డొనాల్డ్ లో పనిచేస్తానని చెప్పిన ప్రదీప్.. అక్కడి తన ఇంటికి పది కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పాడు. ఈ ఒక్కరోజూ కారులో దిగబెడతాను రా అని వినోద్ అడిగితే.. తాను రానని.. ఒక్కరోజు అలా చేసినా ప్రాక్టీస్ దెబ్బతింటుందని చెప్పాడు. పోనీ తనతో కలిసిరావాలని డిన్నర్ చేద్దామని వినోద్ అడిగితే.. దానికి ప్రదీప్ ఏం చెప్పాడో తెలుసా? తాను అలా బయట డిన్నర్ చేయలేనని.. ఇంటికి వెళ్లి తనకోసం, తన అన్నకోసం వంట చేయాలని.. లేదంటే తన అన్న భోజనం చేయకుండానే డ్యూటీకి వెళ్లిపోతాడని చెప్పాడు. ఈ సమాధానాలు విని వినోద్ షాకయ్యాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతుందని చెబితే.. అయితే అవ్వనీయండి.. తననెవరు గుర్తుపడతారన్నాడు ప్రదీప్. అయినా తానేమీ తప్పు చేయడం లేదుగా అని చెప్పాడు. ఈ వీడియోను వినోద్ నిజంగానే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తే.. ఒక్కరోజులోనే 40 లక్షల మంది చూశారు. దీంతో ఇది బాగా వైరల్ అయ్యింది. దేశమంతా ఆ కుర్రాడి ఆత్మస్థైర్యానికి, పోరాట దృక్పథానికి సలామ్ చేస్తోంది. ఆనంద్ మహీంద్రా కూడా ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు. ఇక ప్రదీప్ కు ఆర్మీలో చేరడానికి తగిన శిక్షణ ఇప్పిస్తానన్నారు.. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా.
సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదన్న మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రదీప్. ఇప్పటి కుర్రకారుకు ప్రదీప్ కచ్చితంగా ఆదర్శమే.
19-year-old Pradeep Mehra runs 10 kms on Noida roads, preparing to join the Indian Army. pic.twitter.com/2kgf94a7yq
— Brut India (@BrutIndia) March 21, 2022