Site icon HashtagU Telugu

1,600-Feet Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఈఫిల్ టవర్ కంటే పెద్దది!!

asteroid

asteroid

ఒక భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోంది. అది సోమవారం (మే 16) కల్లా భూమికి దగ్గరగా రావచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న అంపైర్ ఎస్టేట్ బిల్డింగ్ కంటే ఎత్తు (1608 అడుగులు) ఉండే ఆ గ్రహ శకలానికి ‘ఆస్టరాయిడ్ 388945’ (2008 టీజెడ్3) అని పేరు పెట్టారు. మే 16న వేకువజామున 2 గంటల 48 నిమిషాలకు.. అంటే మనం నిద్ర మత్తులో ఉండగా ఆ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది.

సైజులో అది ఈఫిల్ టవర్, స్టాచ్యు ఆఫ్ లిబర్టీల కంటే పెద్దగా ఉంటుందని అంటున్నారు. దానివల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. భూమికి 25 లక్షల మైళ్ళ దూరం నుంచే అది మళ్లీ తన కక్ష్యలోకి తిరిగి వెళ్లిపోతుందని అంటున్నారు. 2020 మే నెలలోనూ ఇదే గ్రహ శకలం భూమికి 17 లక్షల మైళ్ళ దూరం దాకా వచ్చి, తిరిగి వెళ్లిపోయింది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది ఇలా ప్రతి రెండేళ్లకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటుందని నాసా పరిశోధకులు తెలిపారు. మళ్లీ 2024 మే నెలలో ఇది భూమికి 69 లక్షల మైళ్ళ దూరం దాకా వస్తుందని, ఆ తర్వాత అది భూమికి చేరువగా రావాలంటే వందేళ్లు పడుతుందట. 2163 సంవత్సరం మే నెలలో మళ్ళీ భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్ 388945 వస్తుందట.