Virtual Gang Rape : వర్చువల్ రియాలిటీ (వీఆర్) ప్రపంచం ‘మెటావర్స్’లో ఉండే గేమ్స్‌లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. 16 ఏళ్ల అమ్మాయి వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్ ధరించి తన అవతార్‌తో మెటావర్స్‌లోని హారిజాన్ వరల్డ్స్ గేమ్ ఆడుతుండగా.. అదే గేమ్‌లో పాల్గొంటున్న పలువురు పురుషుల అవతార్‌లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాయి. దీనివల్ల ఆ అమ్మాయి శారీరక హానికి గురికానప్పటికీ.. భావోద్వేగపరమైన, మానసికపరమైన ప్రభావాన్ని ఎదుర్కొంది. ఈమేరకు సదరు అమ్మాయి నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా బ్రిటన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై తాజాగా బ్రిటన్ అగ్రశ్రేణి మీడియా సంస్థ ‘డైలీ మెయిల్’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ కేసుపై(Virtual Gang Rape) జరుగుతున్న విచారణకు బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ కూడా మద్దతు పలికారు. ఇలాంటి దుశ్చర్యతో బాలికకు మానసిక గాయమైందని వ్యాఖ్యానించారు. వర్చువల్ వేదికల్లో ఇలా దురుసుగా ప్రవర్తించడాన్ని తక్కువ చేసి చూడలేమన్నారు. వర్చువల్ వాతావరణంలో ఎలా మెలగాలనే దానికీ కొన్ని నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంశాలపై ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలోనూ మెటావర్స్‌లో గేమింగ్ సందర్భంగా పలువురు మహిళలు ఈ విధమైన లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారని కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. 43 ఏళ్ల బ్రిటీష్ మహిళ మెటావర్స్‌లో ‘హారిజాన్ వెన్యూస్’ గేమ్ ఆడుతుండగా లైంగిక వేధింపులకు గురయ్యానని 2022 సంవత్సరంలో ఆరోపించింది. ఆమె వర్చువల్ గేమ్ మొదలుపెట్టిన 60 సెకన్లలోపే మగ అవతార్ కలిగిన నలుగురు వచ్చి గ్యాంగ్ రేప్ చేసి, ఫొటోలు తీశారని ఆమె అప్పట్లో పేర్కొనడం సంచలనం క్రియేట్ చేసింది. మెటావర్స్ గేమింగ్‌లో లైంగికంగా వేధించే చర్యలను నియంత్రించేలా సాంకేతిక మార్పులు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వర్చువల్, ఆన్‌లైన్ నేరాలను కట్టడి చేసేందుకు సరికొత్త పోలీసింగ్ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగదారుల భద్రతకు చర్యలను పెంచాల్సిన బాధ్యత టెక్ కంపెనీలపై ఉంటుందని అంటున్నారు.