Drone Attack : భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాడు అత్యవసర చర్యలుగా 138 విమానాలను రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో గగనతల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయం అధికారులు ముందస్తు చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రతీకార చర్యలకు పాకిస్థాన్ తీవ్రంగా స్పందిస్తోంది. గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లతో భారత్ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పలు మిసైల్‌లు, డ్రోన్ల దాడులు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పేలుళ్లు సంభవించాయి.
Read Also: India-Pakistan tensions : ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
అయితే, భారత రక్షణ వ్యవస్థలు ఈ దాడులకు సమర్థవంతంగా ప్రతిస్పందించాయి. ముఖ్యంగా ఎస్-400 వంటి అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు మరియు మిసైళ్లను సమర్థంగా నిరోధించాయి. ఈ చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేకుండా, ఆస్తినష్టం కూడా తక్కువ స్థాయిలోనే ఉండింది. ఇదిలా ఉంటే, పాక్ దాడులకు భారత సాయుధ బలగాలు గట్టి బదులు ఇచ్చాయి. శుక్రవారం ఉదయం లాహోర్ సమీపంలో పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ప్రతీకార దాడులకు పాల్పడింది. పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక కమ్యూనికేషన్ సెంటర్లపై ఈ దాడులు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో, సరిహద్దు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్-పాక్ మధ్య ఇంత తీవ్ర స్థాయిలో సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం గమనార్హం.
Read Also: Operation Sindoor Movie : ‘ఆపరేషన్ సిందూర్’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?