Delhi : దేశ రాజధాని డిల్లీలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు డిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డయల్ సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ వెల్లడించారు. ప్రస్తుతం డిల్లీ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నప్పటికీ, వాటిలో ఒకదాని ఆధునికీకరణ కోసం ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ విమానాశ్రయం రోజుకూ సుమారు 1,450 విమానాలను నిర్వహిస్తోంది. అయితే రద్దయే విమాన సర్వీసుల వల్ల కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Read Also: CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
విమాన రద్దుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వివిధ విమానయాన సంస్థలతో చర్చలు జరిపినట్లు జైపురియార్ తెలిపారు. ముఖ్యంగా ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు రోజు 33, 25 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలిపారు. అలాగే రద్దీ సమయాల్లో మాత్రమే పనిచేసే కొన్ని విమాన సర్వీసులను సాధారణ సమయాల్లోనూ అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారని వెల్లడించారు. విమానాల రద్దు ప్రభావం ఇతర ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలపై కూడా పాక్షికంగా కనిపించనుంది. ఉదాహరణకు, ముంబయి విమానాశ్రయంలో విమానాల రాకపోకలు 56 నుంచి 54కి తగ్గనున్నాయి. కోల్‌కతాలో 22 నుంచి 21కి, అహ్మదాబాద్‌లో 21 నుంచి 19కి, బెంగళూరులో 38 నుంచి 36కి, చెన్నైలో 20 నుంచి 19కి, పట్నాలో 13 నుంచి 12కి తగ్గనున్నాయి. విమానాశ్రయ పనుల్లో భాగంగా సాధ్యమైనంత తక్కువగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగేలా ప్లాన్ చేసేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోందని, ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే తమ లక్ష్యమని జైపురియార్ స్పష్టం చేశారు. రన్‌వే పునర్నిర్మాణంతో భవిష్యత్తులో మరింత వేగవంతమైన, సురక్షితమైన విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.