Kaleshwaram Project : కాళేశ్వ‌రంపై నీలి`మేఘా`లు

కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌నివ్వ‌కుండా మేఘా ప్రైవేటు సైన్యం, ప్ర‌భుత్వం ప‌హారా కాస్తోంది.

  • Written By:
  • Updated On - August 11, 2022 / 12:10 PM IST

కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌నివ్వ‌కుండా మేఘా ప్రైవేటు సైన్యం, ప్ర‌భుత్వం ప‌హారా కాస్తోంది. అక్క‌డ జరిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించేందుకు వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌ సీరియ‌స్ గా తీసుకున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని అక్ర‌మాలు, మేఘా సంస్థ ఎగ‌వేసిన సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ గురించి ఆధారాల‌తో కూడిన ప్ర‌తుల‌ను గ‌వ‌ర్న‌ర్ కు అంద‌చేసిన‌ట్టు చెబుతున్నారు. ప్రాజెక్టు ఆద్యంత‌మూ జ‌రిగిన లోసుగుల‌ను, మేఘా కంపెనీ నిర్వాకాన్ని తెలియ‌చేస్తూ కీల‌క ఫైల్ ను ఆమె గ‌వ‌ర్న‌ర్ కు. అందించారు. ఆ ఫైల్ మీద గ‌వ‌ర్న‌ర్ స్ట‌డీ చేస్తున్నార‌ని రాజ‌భ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్‌.

ప్ర‌స్తుతం రాజ్ భ‌వ‌న్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య చాలా గాప్ ఉంది. సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న మీద గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేకంగా క‌న్నేశారు. ఇప్ప‌టికే కేంద్రానికి ఆమె ఫిర్యాదు చేసిన అంశాల‌తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చాల‌ని గ‌వ‌ర్న‌ర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లు, నిర్మాణంలోని లోపాలు, మేఘా కంపెనీ ప్రొఫైల్ ను నిపుణుల‌తో అధ్య‌య‌నం చేయిస్తున్నార‌ని వినికిడి. విప‌క్షాలు త‌రచూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి ఫిర్యాదుల‌ను అంద‌చేస్తున్నాయి. తాజాగా సీబీఐకి కూడా ఆ విష‌యం చేర‌డంతో రాజ‌భ‌వ‌న్ అప్ర‌మ‌త్తం అయింది. కేంద్రానికి కూల‌కుషంగా మేఘా కంపెనీ, కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి తెలియ‌చేయ‌డానికి సిద్దం అయింద‌ని రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. కేసీఆర్, మేఘా కంపెనీ మ‌ధ్య ఉన్న సంబంధాల్ని ష‌ర్మిల అందించిన ఫైల్ లో పొందుప‌రిచార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఇరిగేష‌న్ కు సంబంధించిన ఒక కీల‌క అధికారి కుటుంబంలో జ‌రిగిన వివాహానికి కోట్ల రూపాయ‌ల విలువైన స‌దుపాయాల‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మిస్తోన్న కంపెనీ క‌ల్పించింద‌ని జాతీయ వెబ్ సైట్ల‌లో న్యూస్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఆ వివ‌రాల‌ను కూడా గ‌వ‌ర్న‌ర్ కు అంద‌చేసిన ప‌త్రాల్లో ష‌ర్మిల పొందుప‌రిచార‌ని స‌మాచారం. అటు రాజ్ భ‌వ‌న్ ఇటు సీబీఐ ఆఫీసుల్లో మేఘా కంపెనీ, కాళేశ్వ‌రం ప్రాజెక్టుల‌కు సంబంధించిన వివ‌రాలను కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంద‌చేయడం చ‌ర్చ‌నీయాశంగా మారింది.

ఆ ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలు, అవినీతి, దుర్వినియోగం, ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల మ‌ళ్లింపు త‌దిత‌రాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ సీబీఐకి ఫిర్యాదు చేసిన రెండు రోజుల త‌రువాత ష‌ర్మిల గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌డం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఢిల్లీ కేంద్రంగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు, మ‌రో రెండు రోజుల్లో ఇదే అంశంపై ఈడీ కార్యాల‌యం నుంచి సీబీఐ కార్యాల‌యానికి పాద‌యాత్ర చేయ‌డానికి కాంగ్రెస్ లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ సిద్ధం అవుతున్నార‌ని స‌మాచారం. ఒక వేళ సీబీఐ స్పందించక‌పోతే, సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేయ‌డానికి ఆయ‌న సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.

మూడు వారాలుగా వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ కాళేశ్వ‌రం బాహుబలి మోటార్లు ఇప్ప‌టికీ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాలేదు. భారీగా జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌భుత్వం భ‌రించ‌డానికి సిద్ధ‌పడుతుంద‌ని కాంగ్రెస్ లీడ‌ర్ జ‌డ్స‌న్ అభిప్రాయ‌ప‌డుత‌న్నారు. ఒప్పందం ప్ర‌కారం నిర్వాహ‌ణ బాధ్య‌త‌ను మేఘా కంపెనీ తీసుకోవాల‌ని ఆయ‌న చెబుతున్నారు. ఆ మేర‌కు సీబీఐకి కూడా ఆధారాలు ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. తాజాగా ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్ట్ చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌, ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు. మ‌రోసారి కాంగ్రెస్ లీడ‌ర్ జ‌డ్స‌న్ ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి శ్రేణుల‌ను కూడ‌గ‌డుతున్నారు. మొత్తం మీద రాజ్ భ‌వ‌న్, సీబీఐ, ఈడీ వ‌ద్ద‌కు చేరిన కాళేశ్వ‌రం వ్య‌వ‌హారం ఢిల్లీలోని సెంట్ర‌ల్ విజిలెన్స్ వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంద‌న్న‌మాట‌.