Site icon HashtagU Telugu

YS Sharmila : పెద్ద దొర, చిన్న దొర అంటూ.. కేసీఆర్‌, కేటీఆర్ పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

YSRTP President YS Sharmila sensational comments on KCR and KTR

YSRTP President YS Sharmila sensational comments on KCR and KTR

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం కేసీఆర్‌(CM KCR), మంత్రి కేటీఆర్‌(KTR)ల‌పై ట్విట‌ర్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో విమ‌ర్శుల చేశారు. సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు. దేశాలు దాటి పచ్చి అబద్ధాలు వల్లించినా అవి నిజాలు అవ్వవు అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ష‌ర్మిల విమ‌ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం అని దొర‌లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు తెలంగాణ‌కు త‌ల‌మానికం కాదు.. తెలంగాణకు గుదిబండ. తెలంగాణ ప్రజలకు జీవధార కాదు.. నీ కుటుంబానికి కమీషన్ల ధార.. తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార అంటూ ష‌ర్మిల అన్నారు.

కాళేశ్వరం అంటే తండ్రీకొడుకులు ఎప్పుడు కమీషన్లు కావాలన్నా వాడుకునే ఏటీఎం. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఒక అద్భుతం కాదు “మెగా” వైఫల్యం. మీలాంటి పనిమంతులు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు గాలివానకే కూలిన “మెగా” కట్టడం ఆ ప్రాజెక్ట్ అంటూ ష‌ర్మిల తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో మీకే తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. చిన్న దొర 90లక్షలు అంటాడు, పెద్ద దొర 45 లక్షల ఎకరాలు అంటాడు. ఇక హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అంటాడు. సర్కారు వెబ్ సైట్ లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్తారు. ఇందులో అస‌లేది నిజ‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్మాలో చెప్పాల‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

కమీషన్ల కాళేశ్వరంపై ఎవరి మాట నిజం..? ఎవరి మాట అబద్ధం..? చిన్నదొర చెప్పినట్లు 97 లక్షల ఎకరాలకు కాళేశ్వరమే సాగునీరు అందిస్తే.. రాష్ట్రంలో మిగతా సాగునీటి ప్రాజెక్టులు బంద్ పెట్టినట్లా..? ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చుక్క నీరు ఇవ్వనట్లా..? మసిపూసి మారేడు కాయ చేసినట్లు పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా చూపే కనికట్టు చేస్తున్నారంటూ ష‌ర్మిల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లక్ష కోట్ల కాళేశ్వరం లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో లేదో కానీ, దొరలు మాత్రం పచ్చి బూటకపు మాటలు చెప్తున్నారు, దేశాలు దాటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అంటూ ష‌ర్మిల విమ‌ర్శించారు. కమీషన్ల కాళేశ్వరంతో తెలంగాణ దేశానికి ధాన్యాగారం అయితే.. తొమ్మిదేండ్లలో 9 వేల రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్న‌ట్లు? వరి వేస్తే ఉరి అని సన్నాసి మాటలు ఎందుకు చెప్పినట్లు? చిన్న దొర సమాధానం చెప్పాలని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. వైట్ ఎలిఫెంట్ లా మారిన కాళేశ్వరంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 

Also Read :  KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు