వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధినేత వై.ఎస్. షర్మిల (YS Sharmila) తెలంగాణ (Telangana) రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ ట్విటర్ వేదికగా షర్మిల విమర్శలు చేస్తున్నారు. అయితే, షర్మిల విమర్శలకు బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి కౌంటర్ విమర్శలు రాకపోవటం గమనార్హం. తాజాగా, షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత వారంరోజులుగా ఈ అంశంపై మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న షర్మిల.. తొలుత తెలంగాణ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తరువాత ఆ పార్టీ కీలక నేత డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయింది. దీంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందన్న ప్రచారం జరిగింది. ఇవన్నీ కల్పితాలేనని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదని షర్మిల స్పష్టం చేసింది.
అయితే, షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈనెల చివరివారంలో సోనియా, రాహుల్ గాంధీలు ఇడుపులపాయకు వస్తారని, అక్కడ షర్మిల అధికారికంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో పాటు, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న ప్రచారం తెలుగు రాజకీయాల్లో విస్తృతంగా సాగుతుంది. తాజాగా ఆ ప్రచారంపై షర్మిల ట్విటర్ వేదికగా స్పందించింది.
షర్మిల ట్వీట్ ప్రకారం.. వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. తెలంగాణలోనే.. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే అంటూ షర్మిల స్పష్టం చేసింది.
Jp Nadda: 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇదే..