YSRTP : వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలోకి పొంగులేటి? ష‌ర్మిలతో ర‌హ‌స్య భేటీ!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(YSRTP) వేసే అడుగులు కీల‌కంగా మారాయి.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 01:04 PM IST

ఖ‌మ్మం జిల్లా చుట్టూ తెలంగాణ రాజ‌కీయం తిరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(YSRTP) వేసే అడుగులు కీల‌కంగా మారాయి. ఆయ‌న ఏ పార్టీలోకి వెళుతున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల వ‌ర‌కు బీజేపీలోకి ఆయ‌న వెళుతున్నార‌ని టాక్ న‌డిచింది. దానికి బ‌లం చేకూరేలా ఆయ‌న కుమార్తె వివాహ వేడుక‌ల‌కు బీజేపీ లీడ‌ర్లు ఎక్కువ‌గా క‌నిపించారు. అంతేకాదు, ఇండోనేషియా బాలిలో ఇటీవ‌ల జ‌రిగిన వేడుక‌ల‌కు కీల‌క లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు.అక్క‌డ బీజేపీ(BJP)లోకి చేర‌డానికి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలుస్తోంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వేసే అడుగులు (YSRTP) 

ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాల‌ని పొంగులేటి(YSRTP) కోరుకుంటున్నారు. కానీ, అక్క‌డ సిట్టింగ్ ల‌ను కాద‌ని బీఆర్ఎస్ పొంగులేటికి హామీ ఇవ్వ‌లేక‌పోతోంది. అంతేకాదు, మ‌రో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న అనుచ‌రుల కోసం కోసం డిమాండ్ చేస్తున్నారు. అందుకు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో పొంగులేటి ఆ పార్టీని వీడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయ‌న. అడుగుతోన్న స్థానాల‌ను ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉంది. మొత్తం ఖ‌మ్మం జిల్లాలో ఒక ఎంపీ స్థానం, ఆరు అసెంబ్లీ స్థానాల‌ను ఆయ‌న కోసం అడుగుతున్నారు. బీజేపీ(BJP) కూడా ఆయ‌న పెడుతోన్న కండీష‌న్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేక‌పోతోంది.

Also Read : KCR Khammam:గ్రూప్ ల‌కు చెక్!కూక‌ట్ ప‌ల్లికి పువ్వాడ‌,ఖ‌మ్మం బాస్ గా తుమ్మ‌ల‌?

ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. అంతేకాదు, ద‌క్షిణ తెలంగాణ అంత‌టా బీజేపీ ప్ర‌భావం పెద్ద‌గా లేద‌ని చెప్పుకోవాలి. అందుకు నిద‌ర్శ‌నం హుజూర్ న‌గ‌ర్, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల‌ను తీసుకోవ‌చ్చు. అందుకే, ద‌క్షిణ తెలంగాణలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు కూడా బీజేపీకి దొర‌క‌డంలేదు. ఆ క్ర‌మంలో ఖ‌మ్మం జిల్లాలోని ఒక ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల‌ను కోరుతోన్న పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి తొలి రోజుల్లో గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. అయితే, ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు మాత్రం వ్య‌క్తి ప్రాతిప‌దిక‌న గ్రూప్ గా టిక్కెట్ల‌ను ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. అందుకే, బీజేపీ వైపు వెళ‌తాడ‌ని జ‌రిగిన ప్ర‌చారానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

పొంగులేటి ష‌ర్మిల‌ మ‌ధ్యా ర‌హ‌స్య భేటీ

తాజాగా పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌ను క‌లిశారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ర‌హ‌స్య భేటీ జ‌రిగింద‌ని ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. వైఎస్ఆర్ కుటుంబంతో పొంగులేటికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం కూడా వైఎస్సాఆర్ తోనే ప్రారంభం అయింది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీగా గెలిచారు. అంతేకాదు, ఆయ‌న అనుచ‌రుల‌ను ముగ్గుర్ని గెలుపించుకున్నారు. ఆ త‌రువాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అయితే, ఆ రోజు నుంచి కేసీఆర్ అండ్ టీమ్ ఆయ‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డం పొంగులేటి ప‌క్క‌చూపుల‌కు కార‌ణం.

Also Read : Khammam Politics: ఖమ్మం రాజకీయ కాక, పొంగులేటి & తుమ్మల

ఒకే గూటి ప‌క్షులు ఒక చోట‌కు చేర‌తాయ‌ని రెండు రోజుల క్రితం జ‌రిగిన ఆత్మీయ స‌మావేశంలో పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. వాటికి అనుగుణంగా ష‌ర్మిల‌తో ఆయ‌న ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. ఆమె బుధ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలోనూ పొంగులేటి గురించి ప్ర‌స్తావించారు. వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే ఆయ‌న కృత‌జ్ఞ‌తాభావంతో ఉంటార‌ని ష‌ర్మిల అన్నారు. అంటే, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలోకి పొంగులేటి వ‌స్తున్నార‌న్న సంకేతం బ‌లంగా వినిపించారు. ఒక వేళ ఆయ‌న పార్టీలోకి రాక‌పోతే కృత‌జ్ఞ‌త‌లేని లీడ‌ర్ గా గుర్తించాల‌ని కూడా ష‌ర్మిల మీడియా ఎదుట వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.