Site icon HashtagU Telugu

YS Sharmila : ‘అల్లం..బెల్లం’ బంగారు భార‌త్

Sharmila Kcr

Sharmila Kcr

స‌రైన స‌మ‌యంలో స‌రైన సెటైర్ వేయ‌డంలో వైఎస్ఆర్టీపీ అధినేత ష‌ర్మిల ఇటీవ‌ల ఆరితేరింది. కానీ, మీడియా ఆమె మీద ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల మ‌ధ్యకు వాయిస్ వెళ్ల‌డంలేదు. ప్ర‌ధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాల‌న లోని లోపాల‌ను వెంటాడుతోంది. నిరుద్యోగుల ప‌క్షాన ఎప్ప‌టిక‌ప్పుడు నిలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నిరుద్యోగ దీక్ష‌లకు శ్రీకారం చుట్టింది. ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్ష‌ను చేస్తూ యువ‌త ప‌క్షాన నిలుస్తోంది.తెలంగాణ సీఎం కేసీఆర్ అమ‌ర సైనికుల‌కు స‌హాయం అందించ‌డానికి ఢిల్లీ నుంచి ఝార్ఖండ్ కు వెళ్లాడు. గ‌ల్వాన్ లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌కు రూ. 10ల‌క్ష‌ల చొప్పున స‌హాయం అందించాడు. స‌రిగ్గా ఇక్క‌డే ష‌ర్మిల ఆయ‌న వాల‌కాన్ని త‌ప్పుబ‌ట్టింది. అమ‌రులైన సైనిక కుటుంబాలకు స‌హాయాన్ని తెలంగాణ నిరుద్యోగిత‌కు లింకు పెట్టింది. అంతేకాదు, తెలంగాణ కోసం అమ‌రులైన 1200 మంది కుటుంబాల‌కు ఏమి చేశావ్ అంటూ నిల‌దీసింది. ఆత్మ‌హ‌త్యలు చేసుకున్న రైతుల‌కు స‌హాయం ఎందుకు అందిచ‌డంలేద‌ని ప్ర‌శ్నించింది. నిరుద్యోగ భృతి అందించ‌లేని కేసీఆర్ సొంత రాష్ట్రం బాధితుల‌కు అల్లం ఇస్తూ బ‌య‌ట వాళ్ల‌కు బెల్లం పెడుతూ బంగారు భార‌త్ బాట ఏంట‌ని నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

`దేశంలోనే నెంబ‌ర్ ఒన్ రాష్ట్రంగా తెలంగాణ ఉంది. మిగులు బ‌డ్జెట్ తో ఉంది. త‌ల‌స‌రి ఆదాయంలోనూ ముందుంది. పంట దిగుబ‌డిలోనూ నెంబ‌ర్ ఒన్..ఇదే బంగారు తెలంగాణ‌` అంటూ కేసీఆర్ చెబుతున్నాడు. అంతేకాదు, ప్ర‌పంచ స్థాయి మెడ‌ల్స్ సాధించిన సానియా మిర్జాకు కోట్లాది రూపాయ‌లు విరాళం ఇచ్చాడు. ఇటీవ‌ల ప‌ద్మ‌శ్రీ సాధించిన మొగ‌ల‌య్య‌కు కోటి రూపాయ‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌కటించాడు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ పోరాడి మృతి చెందిన ఇత‌ర రాష్ట్రాల రైతుల‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించాడు. వివిధ రాష్ట్రాల జ‌రిగిన విప‌త్తుల‌కు, ప్ర‌మాదాల స‌మ‌యంలోనూ ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించాడు. బ‌య‌ట రాష్ట్రాల్లో బంగారు తెలంగాణ అని చెప్పుకునేలా స‌హాయం అందిస్తున్నాడు కేసీఆర్. కానీ, తెలంగాణ లోని ప‌లు స‌మ‌స్యల కార‌ణంగా మృతి చెందిన వాళ్ల‌కు స‌హాయం చేయ‌డానికి ససేమిరా అంటున్నాడు.ఉద్య‌మ స‌మ‌యంలో 1200 మంది అమ‌రుల‌య్యార‌ని ఆయ‌న ప్ర‌క‌టించాడు. రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత అమ‌రుల కుటుంబాల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని వెల్ల‌డించాడు. కానీ, ఇప్ప‌టికీ వాళ్ల కుటుంబాల‌కు ఎలాంటి స‌హాయం చాలా మందికి అందలేదు.

ఇక ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వేలాది మంది రైతులు మ‌ర‌ణించారు. గిట్టుబాటు ధ‌ర‌లు లేక ఈ ఏడాది పెద్ద సంఖ్య‌లో రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వాళ్ల కుటుంబాల‌కు ఎలాంటి స‌హాయాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌లేదు. ఇంట‌ర్మీడియెంట్ ప‌రీక్ష‌ల పేప‌ర్ లీకు, త‌ప్పుడు ఫ‌లితాల కార‌ణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా, వాళ్ల కుటుంబాల‌కు ఎలాంటి ఆర్థిక స‌హాయం కేసీఆర్ ఇవ్వ‌లేదు. గాల్వాన్ లో అమ‌రులైన సైనిక కుటుంబాలు, పంజాబ్, రాజ‌స్తాన్‌, యూపీ రాష్ట్రాల‌కు చెందిన రైతుల మృతుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌డం ద్వారా జాతీయ స్థాయి గుర్తింపుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాడ‌నే విమ‌ర్శ ఆయ‌న పై ఉంది. రాష్ట్రంలోని విప‌త్తులు, ఆత్మ‌హ‌త్య‌లు, నిరుద్యోగ‌భృతి, తెలంగాణ అమ‌రుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం గురించి కేసీఆర్ గాలికొదిలేశాడు. ఈ ప‌రిణామాన్ని తెలంగాణ‌కు అల్లం..ఇత‌ర రాష్ట్రాల‌కు బెల్లం అంటూ
ష‌ర్మిల సెటైర్ వేయ‌డం గులాబీ శ్రేణుల‌కు మండుతోంది.

Exit mobile version