MLA Poaching Case : `త్రిబుల్ ఆర్` కు సిట్ ఊర‌ట‌! జ‌గ‌న్ ఫ్యాన్స్ కు నిరాశ‌!!

ఎమ్మెల్యేల‌కు ఎర కేసులో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘరామ‌క్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వ‌డం రాజ‌కీయ ప్ర‌కంప‌న రేపింది. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప‌డేసేందుకు చేసిన కుట్ర‌లో ఆయ‌న పాత్ర పై ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 01:56 PM IST

ఎమ్మెల్యేల‌కు ఎర కేసులో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘరామ‌క్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వ‌డం రాజ‌కీయ ప్ర‌కంప‌న రేపింది. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప‌డేసేందుకు చేసిన కుట్ర‌లో ఆయ‌న పాత్ర పై ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. అందుకే సిట్ ఆయ‌న‌కు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 29న హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. కానీ, విచార‌ణ నుంచి ఆయన‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ సిట్ మెయిల్ పంపించ‌డం ఈ కేసులోని లేటెస్ట్ మ‌లుపు.

వారం క్రితం సిట్ ఇచ్చిన నోటీసుల ప్ర‌కారం మంగ‌ళ‌వారం త్రిబుల్ ఆర్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలి. కానీ, ఆయ‌న‌కు మిన‌హాయింపునిస్తూ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గంగాధర్‌ మెయిల్‌ పంపారు. విచారణకు ఎప్పుడు అందుబాటులో ఉండాలో తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. చివ‌రి నిమిషంలో సిట్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నరసాపురం నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ సభ్యుడు త్రిబుల్ ఆర్‌కు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఎ కింద సిట్ గత వారం నోటీసు జారీ చేసింది. నవంబర్ 29న హైదరాబాద్‌లోని సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిన విష‌యం విదిత‌మే.

ఎమ్మెల్యే ఎర కేసులో నిందితులుగా ఉన్న వాళ్ల‌తో ఉన్న‌ సంబంధాలపై ప్రశ్నించేందుకు త్రిబుల్ ఆర్ కు విచారణ బృందం సమన్లు ​​పంపింపింది. ఈనెల 29వ తేదీన సిట్‌ విచారణకు పిలిచిన ఏడో వ్యక్తి త్రిబుల్ ఆర్. ఈ కేసులో ఇప్పటి వరకు న్యాయవాదులు భూసారపు శ్రీనివాస్, ప్రతాప్ గౌడ్, ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖలు సిట్ ఎదుట హాజరయ్యారు. కేరళలో బీజేపీ మిత్రుడు తుషార్, జగ్గు స్వామి ఆచూకీ కోసం దర్యాప్తు బృందం సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సంతోష్‌కు సిట్ నోటీసుపై తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 5 వరకు స్టే విధించింది.

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ఎర చూపి పార్టీ ఫిరాయించేందుకు వ్యూహాన్ని న‌డిపిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నందకుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు తనకు రూ.100 కోట్లు, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. నిందితులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచార‌ణ వేగవంతంగా జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో త్రిబుల్ ఆర్ ను విచారిస్తార‌ని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నంలో ఆయ‌న కూడా ఉన్నార‌ని అనుమానాలు లేక‌పోలేదు. వాటిని ధ్రువీక‌రించ‌డానికి సిట్ త్రిబుల్ ఆర్ కు నోటీసులు పంపార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, విచార‌ణ నుంచి ఆయ‌న్ను మిన‌హాయిస్తూ సిట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఈ కేసు విచార‌ణ‌లోని కొస‌మెరుపు.