YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్ లోకి షర్మిల: వైఎస్ఆర్ ఆప్తుడు కేవీపీ

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో జోష్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తుంది.

YS Sharmila: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో జోష్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో పార్టీ బలాన్ని రాష్ట్రాల వారీగా విస్తరించాలనుకుంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్టాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపారు. దీంతో ఏపీలోనూ ఆ హీట్ మొదలైంది. రాహుల్ వెళ్లే మార్గంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు ఏపీ నేతలతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు.

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కెవిపి తెలిపారు. 2004 మరియు 2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి కుమార్తె కావడంతో షర్మిలకు కాంగ్రెస్ తో బంధం ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు కెవిపి ప్రకటించారు. ఇక ఆయన తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై మాట్లాడుతూ…2018లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని కేవీపీ అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కెవిపి వైఎస్ఆర్ సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.

షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ప్రియాంక గాంధీ షర్మిలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నారు. షర్మిల తెలంగాణలోనే తన రాజకీయ భవిష్యత్తు అంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

Read More: BJP and BRS: ఈటెల, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య చర్చలు, తేల్చేసిన పువ్వాడ?