పాద‌యాత్ర‌లతో రాజ్యాధికారం.మొన్న వైఎస్ఆర్,నిన్న‌ జ‌గ‌న్, నేడు ష‌ర్మిల‌?

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి రాజ్యాధికారాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి ఇప్పుడు ష‌ర్మిల్ పాద‌యాత్ర ద్వారా తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 22, 2021 / 04:45 PM IST

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి రాజ్యాధికారాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి ఇప్పుడు ష‌ర్మిల్ పాద‌యాత్ర ద్వారా తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురిలో ఇప్ప‌టికే ఇద్దరు విజ‌యం సాధించారు. తాజాగా ష‌ర్మిల్ త‌న ల‌క్కును ప‌రిశీలించుకుంటోంది.
2003వ సంవత్సరంలో మూడు నెల‌ల పాటు నిర్విరామంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా 1475 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసి స్వర్గీయ వైఎస్ ఆర్ రికార్డ్ సృష్టించాడు. పాద‌యాత్ర సంద‌ర్భంగా 917 స‌భ‌ల్లో ప్ర‌సంగించాడు. చేవెళ్ల వ‌ద్ద ప్ర‌స్తుత మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆనాడు వైఎస్ఆర్ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టాడు. ఇచ్చాపురం వ‌ర‌కు పాద‌యాత్ర చేసి చ‌రిత్ర‌ను సృష్టించాడు. ఫ‌లితంగా రెండు సార్లు వ‌రుస‌గా సీఎం అయ్యాడు.

పావురాల గుట్ట వ‌ద్ద జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 2009 అక్టోబ‌ర్ 2న సీఎంగా ఉండ‌గా వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి అకాల‌ మ‌ర‌ణం పొందాడు. ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక అనేక మంది గుండెపోటుతో మృతి చెందారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌ను కొద్ది రోజుల పాటు చేశాడు. అనూహ్యంగా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ల‌భించింది. దాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ అర్థాంత‌రంగా ఓదార్పు యాత్ర‌ను ముగించాల‌ని ఆదేశించింది. స‌సేమిరా అంటూ కాంగ్రెస్ పార్టీని వీడి జ‌‌గ‌న్ ఆ యాత్ర‌ను కొన‌సాగించాడు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆ స‌మ‌యంలో ఆయ‌న మీద అక్ర‌మాస్తుల కేసులు న‌మోదు అయ్యాయి. జైలుకు వెళ్లాడు. అదే సమ‌యంలో రాష్ట్రాన్ని రెండుగా కాంగ్రెస్ పార్టీ విభజించింది. ఆ త‌రువాత 2014లో జ‌రిగిన విభ‌జిత ఏపీ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. తెలంగాణలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏపీలో 63 మంది ఎమ్మెల్యేల‌ను వైసీపీ గెలుచుకుంది.
సుమారు 63 మంది ఎమ్మెల్యేల‌తో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం నేత‌గా జ‌గ‌న్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు సిద్ధం అయ్యాడు. కానీ, అసెంబ్లీలో కొన్ని అవ‌మానాల‌ను త‌ట్టుకోలేక‌పోయాడు. అంతేకాదు, వైసీపీలోని 23 మంది ఎమ్మెల్యేల‌ను అధికారంలో ఉన్న టీడీపీ లాగేసుకుంది. దీంతో మ‌న‌స్తాపానికి గురైన జ‌గ‌న్ 2017 న‌వంబ‌ర్ 6న‌ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టాడు. ఇడుపుల పాయ వ‌ద్ద ప్రారంభించిన పాద‌యాత్ర‌ను 341 రోజులు కొన‌సాగించాడు. ఏపీలోని 13 జిల్లాల్లో 3వేల 648 కిలో మీట‌ర్లు న‌డిచాడు. దాదాపుగా 100 స‌భ‌ల్లో ప్ర‌సంగించిన ఆయ‌న టీడీపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాడు. ఫ‌లితంగా 2019లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని తిరుగులేని సీఎంగా జ‌గ‌న్ కొన‌సాగుతున్నాడు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పాల‌న వైఫ‌ల్యాల‌పై వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌కు అక్టోబ‌ర్ 20వ తేదీన శ్రీకారం చుట్టారు. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపించిన ఆమె జెండా, ఎజెండాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి పాద‌యాత్ర‌ను న‌మ్ముకున్నారు. తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, అన్న జ‌గ‌న్ ఇద్ద‌రూ పాద‌యాత్ర‌లు చేసి ముఖ్య‌మంత్రులు అయిన దృష్టాంతాన్ని ష‌ర్మిల ద‌గ్గ‌ర నుంచి చూసింది. అందుకే ఇప్పుడు ఆమె పాద‌యాత్ర ద్వారా త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని న‌మ్ముకుంది. ఒకే ఇంటిలో ఇద్ద‌రు పాద‌యాత్ర చేసిన సీఎంలు అయ్యారు. ఇప్పుడు త‌ను కూడా పాద‌యాత్ర ద్వారా రాజ్యాధికారం ద‌క్కించుకోవాల‌ని ముందుకు క‌దిలింది. తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని 90 స్థానాల‌ను చుట్టేసేలా పాద‌యాత్ర డిజైన్ చేశారు. మొత్తం 4వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేయ‌డానికి ష‌ర్మిల సిద్ధం అయ్యారు. జ‌గ‌న్ జైలుకు వెళ్లిన సంద‌ర్భంగా 2012లో ష‌ర్మిల పాద‌యాత్ర చేసిన విష‌యం విదిత‌మే. ఆనాడు అన్న‌కు మ‌ద్ధ‌తుగా 3వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసిన వైఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిలిచారు. ఆ అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేసి ముఖ్య‌మంత్రి కావాల‌ని అడుగులు వేస్తున్నారు.