Site icon HashtagU Telugu

YS Sharmila Padayatra : ష‌ర్మిల సెకండ్ `షో`

sharmila

ష‌ర్మిల క‌థ కంచికే..తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ క్లోజ్ అవుతుంద‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి చెక్ పెట్టేలా ఈనెల 11వ తేదీ నుంచి ష‌ర్మిల మ‌లి విడ‌త పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌బోతుంది. తొలి విడ‌త గత ఏడాది అక్టోబర్‌ 20న చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రను ఆమె చేపట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం కొండపాకగూడెంలో పాదయాత్ర ఆగిపోయింది.అనంతరం రాష్ట్రంలో ఒమిక్రాన్ ఉధృతం కావడంతో పునఃప్రారంభం ఆలస్యమైంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో కొండపాకగూడెం నుంచే పాదయాత్ర ప్రారంభించాలని షర్మిల నిర్ణయించారు. అనంతరం నార్కెట్‌పల్లిలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగించాల‌ని ఆమె నిర్ణ‌యించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి బ్లూప్రింట్ సిద్ధం అయింది. ప్రజాప్రస్థానంతో మళ్లీ మీ ముందుకు.. మీ సమస్యలను వినేందుకు.. మీ కష్టాలను పంచుకొనేందుకు.. పాదయాత్రతో ప్రతి గడపకు వస్తున్నా..’ అంటూ షర్మిల ట్వీట్ చేయ‌డం మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

వైఎస్ ష‌ర్మిల‌న కోడ‌లిగా తెలంగాణలోని రాజ‌కీయ పార్టీలు అంగీక‌రించ‌డంలేదు. మెట్టినింట ఉన్న ష‌ర్మిల‌ను తెలంగాణ స‌మాజం ఆద‌రిస్తుందా? లేదా? అనేదాక వెళ్ల‌కుండానే ప్ర‌త్య‌ర్థి పార్టీలు వెన‌క్కు నెట్టేశాయి. చీర‌, సారె కావాలంటే తీసుకెళ్లు గానీ తెలంగాణ‌కు రావ‌ద్దంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. ష‌ర్మిల తెలంగాణ‌ ఆడ‌బిడ్డ కాదంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ లోని కొంద‌రు లీడ‌ర్లు టార్గెట్ చేశారు. ఏపీలోని జ‌గ‌న్ పాల‌న చూసుకోమ‌ని కొంద‌రు ఉచిత స‌ల‌హాల‌ను కూడా ప‌డేశారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరిపాల‌న‌లోని వైఫ‌ల్యాలు ప‌రోక్షంగా ష‌ర్మిల‌ను వెంటాడుతున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ అభివృద్ధిని జ‌గ‌న్ కాల‌రాశాడ‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు ష‌ర్మిల‌ను వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మీడియా మ‌ద్ధ‌తు లేకుండా రాజ‌కీయాలు న‌డిపే ప‌రిస్థితి లేదు. సాక్షి మీడియా లేక‌పోతే జ‌గ‌న్ మ‌నుగ‌డే ఉండేది కాద‌ని మేధావులు భావిస్తుంటారు. వాళ్ల భావ‌న‌కు బ‌లం చేకూరేలా తెలంగాణ‌లో ష‌ర్మిల ప‌రిస్థితి ఉంది.

దివంగ‌త వైఎస్ ఆర్ ప్రారంభించిన చేవెళ్ల వ‌ద్ద డిసెంబ‌ర్ 20న వైఎస్ షర్మిల 40వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏక‌బిగిన యాత్ర‌ను పూర్తి చేసేలా బ్లూప్రింట్ ను త‌యారు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 90 నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందింది.గత ఏడేళ్లలో 7,000 మంది రైతులకు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం జ‌రిగిన ఆత్మ‌బ‌లిదానాల‌ను మించిన ఆత్మ‌హ‌త్య‌లు రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అక్టోబర్ 20న పాదయాత్రను ప్రారంభించారు. 400 రోజుల్లో 4,000 కి.మీలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో దళితులపై దాడులు 800 శాతం పెరిగాయని, మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగాయని, మహిళలపై దాడులు కూడా పెరిగాయని ష‌ర్మిల లెక్కించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉటంకిస్తూ నవంబర్ 10న బ్రేకులు వేయడానికి ముందు 21 రోజుల పాటు యాత్ర చేసింది. చేవెళ్ల, మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, మునుగోడు వంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో పాదయాత్ర నిర్వ‌హించారు. రైతుల సమస్యలపై ఇందిరాపార్కు వద్ద 72 గంటల దీక్ష చేసేందుకు ఆమె ప్రయత్నించగా, ఒక్కరోజు మాత్రమే అనుమతి లభించింది. అప్పుడు కూడా ఆమెకు జనం, మీడియా నుంచి పెద్దగా స్పందన రాలేదు.

ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఒక కార‌ణంకాగా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంట్రాక్టును ఉప‌సంహ‌రించుకున్నారని తెలిసింది.పాద‌యాత్ర తొలి వారంలో జ‌గ‌న్ కు అత్యంత స‌మీప బంధువు వైవీ సుబ్బారెడ్డి ఆమెను క‌లిశాడు. ఆ త‌రువాత మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే క‌లిసి వెళ్లాడు. వాళ్ల ద్వారా ఏసీ సీఎం జ‌గ‌న్ దో సందేశం ష‌ర్మిల‌కు పంపాడ‌ని ఆనాడు చ‌ర్చ జ‌రిగింది. వాటిని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా 21 రోజుల పాటు ఆమె యాత్ర చేశారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలోని త‌ప్పులు, మీడియా మ‌ద్ధ‌తు లేక‌పోవ‌డం, జ‌గ‌న్ నుంచి సానుకూల‌త ల‌భించ‌క‌పోవ‌డం, కుటుంబ వ్య‌వ‌హారం ..త‌దిత‌రాలు ఆమెకు బ్రేక్ లు వేశాయ‌ని అనుచ‌రుల‌ టాక్. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ వేదిక‌గా అన్నా , చెల్లిలు మ‌ధ్య తారాస్థాయిలో వివాదం జ‌రిగింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమె మ‌లి విడ‌త ఈనెల 11వ తేదీన ప్ర‌జ‌ల ముందుకు పాద‌యాత్ర రూపంలో రాబోతున్నారు. ఈసారి ఎలాంటి క‌వ‌రేజ్‌, ప్ర‌జా స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.