Site icon HashtagU Telugu

YS Sharmila: తెలంగాణ గ‌డ్డ‌పైనే ష‌ర్మిల రాజ‌కీయం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ఆర్‌ బిడ్డ‌!

Ys Sharmila

Ys Sharmila

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (YS Rajasekhara Reddy) త‌న‌యురాలు వైఎస్ ష‌ర్మిల (YS Sharmila)  ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ (Telangana YSRTP)ని కాంగ్రెస్‌ (Congress) లో విలీనం చేసి ఆమె ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు, ఈ మేర‌కు ఇరు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న సైతం కుదిరింద‌ని కొద్దిరోజులుగా ఇటు మీడియాలో, అటు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, ష‌ర్మిల వ‌ర్గీయులు మాత్రం ఆ వార్త‌ల‌ను ఖండిస్తున్నారు. తాజాగా, వైఎస్ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ష‌ర్మిల చేసిన‌వ్యాఖ్య‌లు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్‌పట్టే విధంగా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వై.ఎస్.ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ష‌ర్మిల శ‌నివారం ఉద‌యం విజ‌య‌మ్మ‌, కుటుంబ స‌భ్యులతో క‌లిసి ఇడుపుల‌పాయ‌కు వెళ్లారు. అక్క‌డ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి వైఎస్ఆర్ స‌మాదివ‌ద్ద నివాళుల‌ర్పించారు.

ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి ష‌ర్మిల చేరుకొని, అక్క‌డ‌ వైఎస్సార్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. తెలంగాణలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతాన‌ని ష‌ర్మిల ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అక్క‌డ వైసీపీ కార్యాల‌యాన్ని కూడా గ‌తంలో ప్రారంర‌భించారు. అయితే, ష‌ర్మిల తెలంగాణ రాజ‌కీయాల‌ను వీడి ఏపీ రాజ‌కీయాల్లో వెళ్తున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఈ ప్ర‌చారం నేప‌థ్యంలో ష‌ర్మిల పాలేరు నియోజ‌క‌వర్గానికి వెళ్లి అక్క‌డ పార్టీ శ్రేణులు ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ఇదే పాలేరు మ‌ట్టి సాక్షిగా పాలేరు ప్ర‌జ‌ల‌కు చెబుతున్నా.. వైఎస్ఆర్ సంక్షేమ పాల‌న అందిస్తాన‌ని మాటిస్తున్నా అని అన్నారు.

ష‌ర్మిల మాట్లాడుతూ.. రైతుల‌కు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని గ‌తంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నా అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశాను. అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తాన‌న్న మాటిస్తున్నా అంటూ ష‌ర్మిల పేర్కొన్నారు. ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టిచూస్తే.. ఆమె తెలంగాణ రాజ‌కీయాల్లోనే కొన‌సాగాల‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Selfie with YSR Statue: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ క్యాంపెయిన్‌కు భారీ స్పందన