Telangana Politcs: ష‌ర్మిల సెంటిమెంట్! కారుకు పంక్చ‌ర్?

రెండుసార్లు తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం `సెంటిమెంట్`. ఈ సారి ఆ అస్త్రాన్ని దాచేసి స‌మైక్యం దిశ‌గా గులాబీ పార్టీ అడుగులు వేసింది.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 07:20 PM IST

రెండుసార్లు తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం `సెంటిమెంట్`. ఈ సారి ఆ అస్త్రాన్ని దాచేసి స‌మైక్యం దిశ‌గా గులాబీ పార్టీ అడుగులు వేసింది. జాతీయ స్థాయిలో రాజ‌కీయం చేయ‌డానికి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పెట్టారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కోల్డ్ స్టోరేజిలోకి వెళ్లింది. కానీ, ఇప్పుడు మ‌రోదారి లేద‌ని గ్ర‌హించిన గులాబీ బాస్ సెంటిమెంట్ ను న‌మ్ముకుంటున్నారు. స‌మైక్య‌వాదులు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నార‌ని సీనియ‌ర్ పొలిటీషియ‌న్, టీఆర్ఎస్ లీడ‌ర్ గుత్తు సుఖేందర్ రెడ్డి మీడియా ముందుకొచ్చి వాయిస్ వినిపించారు. అంటే, మూడోసారి కూడా సెంటిమెంట్ తో సీఎం కావాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నారని అర్థం అవుతోంది.

వాస్త‌వంగా తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఆంధ్రా ఓట‌ర్ల కంటే ఉత్త‌ర భార‌తదేశం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఆ విష‌యం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. సెటిల‌ర్లు ఉన్న నియోజ‌వ‌ర్గాల్లో మాత్ర‌మే టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు గెలిచారు. మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేట‌ర్లు విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో 48 మంది కార్పొరేట‌ర్ల‌ను టీఆర్ఎస్ గెలుచుకోగా, 44 బీజేపీ కైవ‌సం చేసుకుంది. అంటే, సెటిల‌ర్లు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నార‌ని కేసీఆర్ గ్ర‌హించారు. అందుకే, వాళ్ల‌ను సానుకూలంగా ఉంచుకునే చ‌ర్య‌లు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల పాద‌యాత్ర కార‌ణంగా వ‌రంగ‌ల్ కేంద్రంగా న‌డుస్తోన్న ర‌గ‌డ మ‌రోసారి సెంటిమెంట్ ను లేవ‌త్తేలా చేసింది.

బిజెపి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా వైఎస్ షర్మిల అరెస్టును తీవ్రంగా ఖండించి ఆమెకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సైతం వైయస్ షర్మిల ఘటనపై తీవ్రంగా స్పందించారు. వైయస్ షర్మిల ను ఆంధ్ర అంటూ ముద్రవేసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నం ఈసారి బూమ్ రాంగ్ కానుందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే కేసీఆర్ కు అక్కడి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం త‌క్కువ‌గా ఉంటుంది. వైయస్ఆర్ తెలంగాణ పార్టీతో దూకుడుగా ముందుకు వెళ్తున్న వైయస్ షర్మిల కు చెక్ పెట్టడం ద్వారా జ‌గ‌న్మోహన్ రెడ్డికి ప‌రోక్షంగా ల‌బ్ది చేకూరే ఛాన్స్ ఉంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం కోసం రంగంలోకి దిగిన గులాబి బాస్ కేసీఆర్ కు షర్మిల విషయంలో చోటుచేసుకున్న ఘటనలు ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉంది. అంతేకాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రా ఓట‌ర్లు టీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతారు. ఫ‌లితంగా టీఆర్ఎస్ పార్టీకి ఈసారి రాజ్యాధికారం అంద‌నిద్రాక్ష‌గా మారుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉత్త‌ర భార‌త దేశానికి చెందిన సెటిల‌ర్లు ఎక్కువ‌గా వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్నారు. కనీసం 80 స్థానాల్లో వాళ్ల ఓట‌ర్ల ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా. ఆ స్థానాల్లోని ఉత్త‌ర భార‌త్ ఓట‌ర్లు బీజేపీకి సాలిడ్ గా ఉంటార‌ని వినికిడి. అదే, ఆంధ్రా సెటిల‌ర్లు ప్ర‌భావం 70 స్థానాల్లో ఉంటుంద‌ని లెక్కిస్తున్నారు. వాళ్ల కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరమైతే ఈసారి కారు పంక్చ‌ర్ అవుతుంద‌ని గులాబీ పార్టీలోని కొంద‌రి లెక్క‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్రా సెటిల‌ర్ల‌ను దూరం చేసుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంటే, గులాబీ శ్రేణులు మాత్రం సెంటిమెంట్ ను ప‌ట్టుకున్నారు. ష‌ర్మిల రూపంలో ఆంధ్రా సెంటిమెంట్ ను లేపితే భారీ న‌ష్టం కారు పార్టీకి త‌ప్పంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.