YS Sharmila: కాంగ్రెస్ లో విలీనం చెయ్యట్లేదు: షర్మిల

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయంగా ఉత్కంఠ నెలకొంటుంది. డబ్బు, మందిబలం ఇవేం ఫలితాలను మార్చలేవన్న సంకేతాలు తాజాగా కర్ణాటక ఫలితాలు చెప్తున్నాయి.

YS Sharmila: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయంగా ఉత్కంఠ నెలకొంటుంది. డబ్బు, మందిబలం ఇవేం ఫలితాలను మార్చలేవన్న సంకేతాలు తాజాగా కర్ణాటక ఫలితాలు చెప్తున్నాయి. దేశంలో బలమైన పార్టీగా ఎదిగిన బీజేపీ కర్ణాటలో ఘోరంగా ఓటమి చవిచూసింది. దీంతో బీజేపీ ఆలోచనలో పడింది. తెలంగాణాలో ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఉత్సాహంతో ఉన్న కమలం తాజా రిజల్ట్స్ తో ఒకింత నీరసించిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకుంటుంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ కాబోతున్నాయి అంటూ రేవంత్ వర్గం కోడైకూస్తోంది. కాగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే చర్చలు జరిగినట్టు, ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు షర్మిల తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో కలపనున్నట్టు ప్రచారం జోరుగా సాగింది.

వైఎస్ఆర్టీపి పార్టీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికరంగా స్పందించారు. విలీనం చేసే ఆలోచన ఉన్నప్పుడు అసలు పార్టీ పెట్టేదాన్ని కాదన్నారు. విలీనం చేసేందుకు పార్టీ పెట్టలేదని, తెలంగాణాలో రాజన్న పరిపాలన తీసుకొచ్చేందుకు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టానని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, నేనేందుకు ఆ పార్టీలో విలీనం చేస్తానని ఆమె ప్రశ్నించారు. ఓ సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపికి 40 సీట్లకు పైగానే వస్తాయని తేలిందని, అలాంటి సందర్భంలో 20, 30 సీట్ల కోసం విలీనం చేయాల్సిన అవసరం ఏముందని అభిప్రాయపడ్డారామె. ఇక రెండు మూడు రోజులుగా తనకు ఇతర పార్టీల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని, ఎస్ఎంఎస్ లు చేస్తున్నారని, అయితే ప్రస్తుతం మా పార్టీ ఛార్జింగ్ మోడ్ లో ఉందని ఆమె అన్నారు. దాదాపుగా 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, అయితే విలీనం చేసే ఆలోచన ఉన్నప్పుడు నేనెందుకు పాదయాత్ర చేస్తానని మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించిందామె.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెల సీట్లను కూడా గెలుచుకోలేదని ఆమె అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి అధికార పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకురాగలరా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, ఆ పార్టీలో నా పార్టీని విలీనం చేయాలనుకోవడం హాస్యాస్పదమని అన్నారు షర్మిల.

Read More: ICE APPLE BENEFITS : సమ్మర్ లో కూల్ చేసే ఐస్ యాపిల్