TSPSC లీకేజ్ వ్యవహరం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల TSPSC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె ఆందోళన చేశారు. వైఎస్సాఆర్ టీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. TSPSC కేసులో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించి.. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసులు తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని.. లుకౌట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినలా అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆందోళన చేసిన షర్మిలతో పాటు ఇతర నాయకులు, కార్యాకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.