YS Sharmila : ష‌ర్మిల ఢిల్లీ రాజ‌కీయంలో `కాళేశ్వ‌రం` క‌థ‌

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల క్ర‌మంగా కేసీఆర్ కు ఏకుమేకైవుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 02:13 PM IST

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల క్ర‌మంగా కేసీఆర్ కు ఏకుమేకైవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి క్లోజ్ అయిన త‌రువాత రాష్ట్రం పేరుతో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇప్పుడు ఇదే అంశాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాద‌ల‌ని ష‌ర్మిల చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2,500 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసిన ఆమె సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అంతేకాదు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు కురిపించారు. తాజాగా ఆమె మీద టీఆర్ఎస్ మంత్రులు ఆమె మీద ఏకంగా స్పీక‌ర్ కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ వ‌దిలిన బాణం ష‌ర్మిల అంటూ ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఆ భావ‌న‌కు బ‌లం చేకూరేలా కేసీఆర్ జాతీయ పార్టీ బ బీఆర్ఎస్ ను ప్ర‌క‌టించిన రోజే ఆమె ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ఢిల్లీలోని సీబీఐ డైరెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాల‌ను సీబీఐ డైరెక్ట‌ర్ కు అందచేశారు. ఆ ప్రాజెక్టు ఇటీవ‌ల మునిగిపోయిన సంద‌ర్భంగా స్పాట్ లోకి వెళ్లిన షర్మిల‌ను అనుమ‌తించ‌లేదు. ఆ రోజు నుంచి కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని అవినీతి పై పోరాటాన్ని తీవ్ర‌త‌రం చేశారు. ఆ ప్రాజెక్టును నిర్మించిన మేఘా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు మ‌ధ్య న‌డిచిన అక్ర‌మ లావాదేవీల గురించి మీడియా ముఖంగా ప్ర‌స్తావించారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి గురించి కాంగ్రెస్ తో పాటు ప‌లు రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాల నేత‌లు త‌ర‌చూ ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ ఏకంగా ఈడీ, సీబీఐ, విజిలెన్స్ త‌దిత‌ర కేంద్ర సంస్థ‌ల‌కు ఆధారాల‌ను అందించారు. విచార‌ణ చేప‌ట్టాల‌ని హైద‌రాబాద్ లోని ఈడీ ఆఫీస్ నుంచి ర్యాలీ కూడా చేశారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద సేక‌రించిన పత్రాల‌ను జోడిస్తూ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాల‌పై రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే ఫైల్ దాదాపుగా ష‌ర్మిల చేతికి అందింది. ఆమె ఇటీవ‌ల ఒక ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ని క‌లిసి అందించారు. తాజాగా ఢిల్లీ వెళ్లి కాళేశ్వ‌రం పై ఫిర్యాదు చేశారు.

రాజ‌కీయ కోణం నుంచి చూస్తే తెలంగాణ‌లో రాజ్యాధికారం కోసం ప‌రిత‌పిస్తోన్న బీజేపీకి ఇదే మంచి అస్త్రం. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు మీద విచార‌ణ కు ఆదేశించ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టుల‌కు అవార్డుల‌ను ఇచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ష‌ర్మిల ఇచ్చిన ఫైల్ ఆధారంగా సీబీఐ చేత విచార‌ణ‌కు ఆదేశించ‌డానికి బీజేపీకి అందొచ్చిన అవ‌కాశం. కానీ, ఆ ప్రాజెక్టు నిర్మించిన మేఘా కంపెనీ య‌జ‌మానితో ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌న్నిహిత సంబంధం ఉంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ అత్యంత స‌న్నిహితునిగా బీజేపీతో మెలుగుతున్నారు. ఆ క్ర‌మంలో ష‌ర్మిల ఇచ్చిన ఫైల్ ముందుకు క‌దులుతుందని భావించ‌లేం.

ప్ర‌స్తుతం ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి విచార‌ణ కొన‌సాగుతోంది. తెలంగాణ‌లోనూ కొంద‌రికి నోటీసులు ఇచ్చారు. ఆ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత ఉన్నార‌ని ఢిల్లీ బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కొన్ని వీడియోల‌ను కూడా బ‌య‌ట‌పెట్టారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు క‌విత‌కు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అంద‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ష‌ర్మిల కాళేశ్వ‌రం మీద చేసిన ఆరోప‌ణ‌ల ఫైల్ ను సీబీఐ ప‌రిశీలిస్తుందా? అంటే వ‌చ్చే స‌మాధానం ఏమిటో అంద‌రికీ తెలిసిందే.

వైఎస్సాఆర్ టీపీ స్థాపించ‌డంతో ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఆ పార్టీని క్లోజ్ చేయించాల‌ని జ‌గ‌న్ ద్వారా కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశార‌ని తెలుస్తోంది. అందుకు భిన్నంగా షర్మిల చాలా వేగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నారు. అంతేకాదు, కాళేశ్వ‌రం మీద సీబీఐ డైరెక్ట‌ర్ కు నేరుగా ఫిర్యాదు చేయ‌డం కేసీఆర్ కు ఏ మాత్రం న‌చ్చ‌డంలేద‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ రూపంలో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తున్నారు. ఇలా ప‌లు అంశాల‌తో క‌ల‌గూర‌గంప‌గా ఉన్న తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం కేసీఆర్, ష‌ర్మిల‌, జ‌గ‌న్ చుట్టూ తిరుగుతోంది. దీనికి ఎలాంటి ఎండింగ్ ఉంటుందో చూడాలి.