YS Sharmila : టీఆర్ ఎస్ లో తాలిబ‌న్లు, మ‌రో ఆప్ఘాన్ గా తెలంగాణ‌: ష‌ర్మిల

తెలంగాణ‌లో తాలిబ‌న్ రాజ్యం ఉంద‌ని వైఎస్సాఆర్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు. ఉద్య‌మ‌కారుల‌ను త‌రిమేసి తాలిబ‌న్ల మాదిరిగా తెలంగాణను దోచుకుంటున్నార‌ని అన్నారు.

  • Written By:
  • Updated On - December 1, 2022 / 04:24 PM IST

తెలంగాణ‌లో తాలిబ‌న్ రాజ్యం ఉంద‌ని వైఎస్సాఆర్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు. ఉద్య‌మ‌కారుల‌ను త‌రిమేసి తాలిబ‌న్ల మాదిరిగా తెలంగాణను దోచుకుంటున్నార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ , మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తుల మీద సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. తాలిబ‌న్ల చీఫ్ మాదిరిగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ల్లిన న‌లిపిన‌ట్టు న‌లిపేస్తాం, క‌నిపించ‌కుండా చేస్తాం అంటూ బెదిరింపుల‌కు దిగితే ష‌ర్మిల భ‌య‌ప‌డ‌ద‌ని హెచ్చరించారు. పాద‌యాత్ర‌ను శుక్ర‌వారం నుంచి తిరిగి ప్రారంభిస్తాన‌ని వెల్ల‌డించారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై తో భేటీ అయిన త‌రువాత ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాల‌న, తెలంగాణ‌లో తాలిబ‌న్ల మాదిరిగా ఏ విధంగా పాల‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలియచేస్తూ సుప్రీం కోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టుల‌కు లేఖ‌లు రాస్తాన‌ని ప్ర‌క‌టించారు.

పాదయాత్రను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవాలని చూస్తున్నాయని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆందుకే నర్సంపేటలో వాహనాన్ని ధ్వంసం చేసి దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. ధ్వంసమైన వాహనంలో ప్రగతి భవన్ కు వెళ్తుండగా పోలీసులు తనను అరెస్ట్ చేసిన వైనం, తాను కూర్చున్న కారును టోయింగ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తీరుపై రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ష‌ర్మిల ఫిర్యాదు చేయ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది.

సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా మార్చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబన్లే అని ఎద్దేవా చేశారు. కేవలం ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన కేసులో తనను అరెస్టు చేశారని, గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్ లో విచారించడంతో పాటు, కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ‘ఈ కేసులో సీఎం కేసీఆర్ సూచన మేరకు నన్ను రిమాండ్ చేయాలని పోలీసులు అనుకున్నారు. రిమాండ్ ఎందుకు చేస్తారు? నేనేమైనా నేరం చేశానా? నా నుంచి ఏమైనా ఆధారాలు సేకరించాలా? అందుకే జడ్జీ రిమాండ్ కు అనుమతించలేదు’ అని పేర్కొన్నారు.

పాదయాత్రలో కేసీఆర్ , మంత్రులు, ఎమ్మెల్యేలు, క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవినీతి గురించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నానని షర్మిల చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం వేల కోట్లను అక్రమ మార్గంలో సంపాదించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమే దేశంలో అత్యంత ధనవంతమైన రాజకీయ కుటుంబం అన్నారు. పాదయాత్రలో తనపై, తమ నాయకులపై దాడులు చేసేందుకు టీఆర్ఎస్, ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా జ‌రిగితే కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

తెలంగాణ కోడ‌లిగా వ‌ర్త‌మానం, భవిష్య‌త్ అంతా ఈ రాష్ట్రంలోనే ఉంటుంద‌ని చెప్పారు. మెట్టినింట ఏ స్త్రీ అయినా ఉంటుంద‌ని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా బ‌రాబ‌ర్ పాద‌యాత్ర చేయ‌డంతో పాటు రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల దీవెన‌లు అందుకుంటాన‌ని చెప్పారు. మంత్రి కేటీఆర్ స‌తీమ‌ణి ఏ ప్రాంత‌మో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసే ముందుగా కేటీఆర్ భార్య ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో చెప్పాల‌ని నిల‌దీశారు. మొత్తం మీద ఆమె మీడియాతో పంచుకున్న అంశాల‌ను చూస్తే రాబోవు రోజుల్లో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్టే యోధురాలుగా మారుతోంద‌ని అర్థం అవుతోంది.