YS Sharmila Arrest : వైఎస్ ఫ్యామిలీ క‌థా చిత్రం! తాడేప‌ల్లి-హైద‌రాబాద్ వ‌యా లోట‌స్ పాండ్!

స్విచ్ తెలంగాణ‌లో వేస్తే బ‌ల్బు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం తాడేప‌ల్లి వ‌ద్ద వెలిగింది.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 04:31 PM IST

స్విచ్ తెలంగాణ‌లో వేస్తే బ‌ల్బు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం తాడేప‌ల్లి వ‌ద్ద వెలిగింది. వైఎస్సాఆర్ తెలంగాణ చీఫ్ ష‌ర్మిల‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డంపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌క్రిష్ణా రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ అంత‌రాయ‌మంటూ ష‌ర్మిల‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌తంగా బాధ‌ప‌డుతున్నాన‌ని మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. మ‌రో వైపు విజ‌య‌మ్మ‌ను పోలీసులు గృహ‌నిర్బంధం చేయ‌గా ష‌ర్మిల పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద దీక్ష‌కు దిగ‌డం హైడ్రామాకు తెర‌లేసింది.

వాస్త‌వంగా పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి షర్మిలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైయింది. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో షర్మిల కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఆమెకు ర‌క్ష‌ణ లేద‌ని పోలీసులు ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన కారులోనే మంగ‌ళ‌వారం ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల ప్ర‌య‌త్నించారు. ఆ విషయాన్ని పసిగట్టిన పోలీసులు పంజాగుట్ట వద్ద ఆమెను నిలిపివేశారు. కారులో నుంచి దిగేందుకు ఆమె నిరాకరించడంతో క్రేన్ సహాయంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ష‌ర్మిల‌ను కారుతో పాటు తరలించారు.

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా కారు డోర్లను బద్దలు కొట్టి షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద ఐపీసీ 353, 333, 337 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. మొత్తంగా పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దాకా షర్మిలను తరలిస్తున్న క్రమంలో ఒక పెద్ద హైడ్రామానే న‌డిచింది. దానికి కొన‌సాగింపుగా ష‌ర్మిల త‌ల్లి విజ‌య‌మ్మ సంఘీభావం తెల‌ప‌డానికి బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆ క్ర‌మంలో విజ‌య‌మ్మ‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో పోలీసులతో విజయమ్మ తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు.

కుమార్తెను చూసేందుకు వెళితే మీకొచ్చిన ఇబ్బందేమిటని ఆమె పోలీసులను నిలదీశారు. పోలీసుల‌ చర్యను నిరసిస్తూ విజయమ్మ తన ఇంటిలోనే ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఆమె దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కుమార్తె ను పోలీసులు విడుద‌ల చేసే వ‌ర‌కు దీక్ష ను కొన‌సాగిస్తాన‌ని భీష్మించారు. ప్రస్తుతం లోట‌స్ పాండ్ టూ ఎస్సాఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ వ‌యా ఏపీ రాజ‌కీయ
డ్రామా న‌డుస్తోంది. దాన్ని ర‌క్తి క‌ట్టించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల మీడియా ముందుకు రావ‌డం హైడ్రామాకు తావిస్తోంది.

ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలో నిత్యం పోలీసుల అరెస్ట్ చూస్తున్నాం. అర్థ‌రాత్రిళ్లు ఇళ్ల‌లోకి వెళ్లి ఎలాంటి ముంద‌స్తు నోటీసులు లేకుండా పోలీసులు భ‌య‌కంపితులు చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం. కేవ‌లం రీ పోస్ట్ చేశార‌ని 70ఏళ్ల రంగ‌నాయ‌క‌మ్మ‌ను కూడా వ‌ద‌ల‌కుండా ఏపీ పోలీసులు స్టేష‌న్ కు లాగారు. విశాఖ‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్ మాస్క్ అడిగినందుకు న‌డిరోడ్డుపై పిచ్చోడ్ని కొట్టిన‌ట్టు చేత‌లు విర‌గ‌తీసి కొట్టారు. వైసీపీ రెబ‌ల్ ఎంపీ త్రిబుల్ ఆర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, విచార‌ణ చేసిన తీరు అంద‌రికీ తెలిసిందే. ఇలా చెప్పుకంటూ పోతే, ఏపీ ప్ర‌భుత్వం చేస్తోన్న రూల్ ఆఫ్ లా అధిక్ర‌మ‌ణ‌కు ఉదాహ‌ణ‌లు బోలెడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ష‌ర్మిలను అరెస్ట్ చేయ‌డాన్ని ఏపీ ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణా రెడ్డి స్పందించే ముందు ఏపీ లోని అరెస్ట్ ల‌ను రివ్యూ చేసుకుని ఉంటే బాగుండేద‌ని విప‌క్షాలు స‌ల‌హా ఇస్తున్నారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణ రాజ‌కీయాలను ష‌ర్మిల అరెస్ట్ వ్య‌వ‌హారం మ‌లుపు తిప్ప‌నుందా? అనేది చూడాలి.