YS Murder :రాజ‌కోట ర‌హ‌స్యంపై ష‌ర్మిల కామెంట్స్, మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు రెడీ!

వైఎస్సార్ టీపీ చీఫ్ ష‌ర్మిల‌ ఏ విష‌యాన్నైనా సూటిగా,సుత్తిలేకుండా చెబుతారు.

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 05:03 PM IST

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల ఏ విష‌యాన్నైనా సూటిగా, సుత్తిలేకుండా చెబుతారు. వరంగ‌ల్ జిల్లాలో ఆగిపోయిన చోట నుంచి పాద‌యాత్ర, వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య గురించి ఆమె తీవ్రంగా స్పందించారు. ఈనెల 28వ తేదీ నుంచి పాద‌యాత్ర‌ను తిరిగి ప్రారంభిస్తాన‌ని వెల్ల‌డించారు. హైకోర్టు ఆదేశాల‌ను పోలీసులు పాటించాల‌ని సూచించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలా అడ్డుకుంటుందో చూస్తానంటూ హెచ్చ‌రించారు. రాజ్యాంగ‌ప‌రంగా, చ‌ట్ట‌ప‌రంగా న‌డుచుకోవాల‌ని కేసీఆర్ కు సూచించారు. అంతేకాదు, ఏపీ ప్ర‌భుత్వం మీద కూడా ఆమె ప‌రోక్షంగా మండిప‌డ్డారు. బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి(YS Murder) హత్య జ‌రిగిన మూడేళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ దోషుల‌ను ఎందుకు శిక్షించ‌లేక‌పోయార‌ని ప్ర‌శ్నించారు. ఇలా ఉంటే సీబీఐ(CBI) లాంటి వ్య‌వ‌స్థ‌ల మీద న‌మ్మ‌కం పోతుంద‌ని చెబుతూ వివేకానంద‌రెడ్డి గొప్ప‌త‌నాన్ని గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య(YS Murder) 

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(YS Murder) హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇటీవల సీబీఐ ఇచ్చిన నోటీసుపై షర్మిల వ్యాఖ్యానించారు. సిబిఐ(CBI) విధులను నిజాయితీ నిర్వ‌హించాల‌ని కోరారు. విచార‌ణ అధికారుల్లో నిజాయితీలేక‌పోతే ఇలాంటి కేసులు పరిష్కరించబడవని అభిప్రాయ‌ప‌డ్డారు. లోపభూయిష్ట వ్యవస్థల కారణంగా సాధారణ పౌరులకు సంబంధించిన చిన్న కేసులు కూడా ఆలస్యం అవుతున్నాయని ఆవేదన చెందారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని వైఎస్ఆర్ కుటుంబం తరపున షర్మిల సీబీఐని అభ్యర్థించ‌డం విశేషం.

Also Read : YS Viveka Murder : వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ స‌మాన్లు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగ‌ళ‌వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను మూడు పెట్టెల్లో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు త‌ర‌లించారు. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించ‌డంతో కేసు విచార‌ణ వేగం పెరిగింద‌ని తెలుస్తోంది. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్ర‌మంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.

రాజ‌కోట ర‌హ‌స్యాన్ని ఛేదించాల‌ని..

గ‌త ఎన్నిక‌ల‌కు ముందుగా వివేక హ‌త్య‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్ర‌యంలో హ‌త్యాయ‌త్నం సంచ‌ల‌నం క‌లిగించిన కేసులు. ఆనాడు బాబాయ్ హ‌త్య మీద సీబీఐ విచార‌ణ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరారు. ఆయ‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం వెనుక జ‌రిగిన కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చారు. అప్ప‌టి నుంచి ఆయ‌న టోన్ మారింది. సీబీఐ విచార‌ణ అవ‌స‌రంలేద‌ని బాబాయ్ కేసు విష‌యంలో రివ‌ర్స్ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఇక ఆయ‌న‌పై కోడిక‌త్తి తో హ‌త్యాయ‌త్నం చేసిన నిందితుడు శ్రీను విష‌యంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే, ఈ రెండు కేసుల వెనుక రాజ‌కోట ర‌హ‌స్యాన్ని ఛేదించాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటు ఇప్పుడు ష‌ర్మిల కూడా కేసుల వెనుక ఉన్న దోషుల‌ను శిక్షించాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం.