CM Vs Governor : చంద్రుల‌కు `రాజ్ భ‌వ‌న్‌`ల గిలిగింత‌లు

స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాల‌ను చూడొచ్చ‌ని ఆశించిన వాళ్ల‌కు నిరాశే మిగిలింది.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 11:42 AM IST

స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాల‌ను చూడొచ్చ‌ని ఆశించిన వాళ్ల‌కు నిరాశే మిగిలింది. `ఎట్ హోమ్` కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ హాజ‌రు అవుతార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు లీకులు ఇచ్చాయి. ఆ మేర‌కు మీడియా కూడా ఫోక‌స్ చేసింది. చివ‌రి నిమిషంలో రాజ్ భ‌వ‌న్ కు దూరంగా ఉంటూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్, సీఎం మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతుంద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది.

విజ‌య‌వాడ కేంద్రంగా గ‌వ‌ర్న‌ర్ హరిచంద‌న్ ఏర్పాటు చేసిన `ఎట్ హోమ్` కార్య‌క్ర‌మానికి తొలిసారిగా సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు హాజ‌ర‌య్యారు. కానీ, ప‌ర‌స్ప‌రం ముఖాలు చూసుకోవ‌డానికి కూడా అవ‌కాశం లేకుండా గ‌డిపారు. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు తొలిసారిగా `ఎట్ హోమ్‌` కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు. స‌హ‌జంగా అంద‌రూ క‌లివిడిగా అక్క‌డ క‌నిపిస్తారు. కానీ, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరంగా ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌, సీఎం ఇద్ద‌రూ కలుసుకునే ఉండే ఫోటోల కోసం అంద‌రూ వేచిచూశారు. ఎంపీలు కేశినేని నాని, అచ్చెంనాయుడుతో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేక టేబుల్ పై కూర్చొని క‌నిపించారు. గ‌వ‌ర్న‌ర్, సీఎం ఇత‌రులు మ‌రో టేబుల్ మీద ఉన్నారు.

స‌హ‌జంగా సీఎం, ప్ర‌తిప‌క్ష‌నేతల‌ను గ‌వ‌ర్న‌ర్ క‌ల‌పాలి. ఒకే చోట అతిథ్యం ఇవ్వాలి. కానీ, వేర్వేరుగా టేబుళ్ల మీద అతిథ్యం వాళ్లిద్ద‌రూ తీసుకున్నారు. ఆ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ కూడా పాజిటివ్ గా మూవ్ కాలేదు. ప్రొటోకాల్ ను ఏపీ రాజ్ భ‌వ‌న్ పాటించ‌లేదు. ఆ విష‌యాన్ని టీడీపీ సీరియ‌స్ గా తీసుకుంది. వాస్త‌వంగా చంద్ర‌బాబు హాజ‌రు కావాల‌ని తొలుత అనుకోలేదు. ప్ర‌భుత్వంతో క‌లిసి రాష్ట్రాభివృద్ధి దిశ‌గా వెళ్లాల‌ని పాజిటివ్ స్టెప్ వేశార‌ట‌. కానీ, గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌న్లో జ‌రిగిన అవ‌మానం తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లుగా గ‌వ‌ర్న‌ర్, సీఎం ల మ‌ధ్య ప్రొటోకాల్ వివాదం న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణ‌స్వీకారానికి ఇద్ద‌రూ క‌లిశారు. ఆ రోజు నుంచి ఇద్ద‌రూ ఇక నుంచి క‌లిసి వెళ‌తార‌ని అనుకున్నారు. కానీ, `ఎట్ హోమ్` కార్య‌క్ర‌మానికి కేసీఆర్ దూరంగా ఉండ‌డంతో మ‌ళ్లీ వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ప్రోటోకాల్ రేగిన వివాదం లైవ్ లోనే ఉంద‌ని సంకేతం వెళ్లింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భ‌వ‌న్ల కేంద్రంగా జ‌రిగిన `ఎట్ హోమ్‌` హ్యాపీ కంటే వివాదాల‌ను మిగిల్చాయ‌న్న‌మాట‌.